ప్రతి కదలిక.. తెలిసిపోతుందిక..

19 Dec, 2022 04:26 IST|Sakshi

ఎన్‌ఐసీతో త్వరలో రవాణాశాఖ ఒప్పందం 

ఏప్రిల్‌ నుంచి దశలవారీగా అమలు

సాక్షి, అమరావతి: అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాల గమనాన్ని ట్రాకింగ్‌ చేసే వ్యవస్థను నెలకొల్పనుంది. అందుకోసం అన్ని వాహనాలకు ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. వాహనాల ట్రాకింగ్‌ను పర్యవేక్షించేందుకు నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో దాదాపు 1.52 కోట్ల వాహనాలున్నాయి.

వాటిలో రవాణాయేతర (వ్యక్తిగత) వాహనాలు 1.35 కోట్ల వరకు ఉంటాయని అంచనా. మిగిలిన దాదాపు 17 లక్షల వాహనాలు వాణిజ్య వాహనాలు. వాటిలో ప్రయాణ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు ఉన్నాయి. ఈ 17 లక్షల వాహ­నాలకు ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది.  కేంద్ర రవాణాశాఖ తాజా మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది.

వాహనాలకు ట్రాకింగ్‌ పరికరాల ఏర్పా­టును 2023 ఏప్రిల్‌ నుంచి దశలవారీగా అమలు చేయాలని రవాణాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదట ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బస్సులకు ట్రాకింగ్‌ పరికరాలు అమరుస్తారు. ట్రాకింగ్‌ విధానాన్ని పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సరిచేసిన అనంతరం అన్ని ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు ట్రాకింగ్‌ పరికరాలు ఏర్పాటుచేస్తారు. 2024 జనవరి నాటికి రాష్ట్రంలో అన్ని వాహనాలకు ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటు పూర్తిచేయాలని రవాణాశాఖ భావిస్తోంది.  

24/7 పర్యవేక్షణ  
ట్రాకింగ్‌ పరికరాలు ఏర్పాటు చేసిన వాహనాల ట్రాకింగ్‌ను 24/7 పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఐసీతో రవాణాశాఖ త్వరలో ఒప్పందం చేసుకోనుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.20 కోట్లు వెచ్చించనున్నారు. వాహనాల ట్రాకింగ్‌ను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అవసరమైన ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు అక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఎన్‌ఐసీ శిక్షణ ఇస్తుంది.   

అక్రమాలు, నేరాలకు అడ్డుకట్ట  
అక్రమ రవాణాను అరికట్టడం, రహదారి భద్రత కోసమే ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాకింగ్‌ పరికరం ఏర్పాటుతో వాహనాలు ఏ మార్గంలో ఏ సమయంలో ఎంతవేగంతో ప్రయాణిస్తోంది పర్యవేక్షించవచ్చు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి సంబంధిత ప్రాంతంలోని పోలీసు, రవాణాశాఖ అధికారులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ విషయమై ఆ వాహనాల యజమానులకు సమాచారం ఇస్తారు. దీంతో యజమానులు తమ డ్రైవర్‌కు ఫోన్‌చేసి వేగాన్ని నియంత్రించమని ఆదేశించేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల యజమానులు కూడా తమంతట తా­ము­గా ఆ వాహనాల ట్రాకింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ఇక అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టేందుకు ఈ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

స్మగ్లింగ్, ఇతర దందాల్లో ఉపయోగించే వాహనాలు ఏయే మార్గాల్లో ప్రయాణించిందీ, అక్ర­మంగా తరలించే సరుకును ఇతర వాహనాల్లోకి మార్చినా ఇట్టే కనిపెట్టవచ్చు. అక్రమ రవాణా దందాకు కేంద్రస్థానం, వాటి గమ్యస్థానాన్ని కూడా గుర్తించవచ్చు.

ఇక కిడ్నాప్‌లు, ఇతర నేరాల్లో నేరస్తులు ఉపయోగించే వాహనాల గమనాన్ని గుర్తించి సంబంధిత ప్రాంతంలో పోలీసులను అప్రమత్తం చేయవచ్చు. కేసు విచారణలో ట్రాకింగ్‌ రికార్డును సాక్ష్యాధారాలుగా సమర్పించవచ్చు. ఇది దో­షు­లకు శిక్షలు విధించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.

గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే విక్రయం 
రాష్ట్రంలో ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు అవసరమైన ట్రాకింగ్‌ పరికరాల సరఫరాకు రవాణాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. వాహన యజమానులు తమ వాహనాలకు ట్రాకింగ్‌ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. గుర్తింపు పొందిన డీలర్ల నుంచే ట్రాకింగ్‌ పరికరాలు కొనుగోలు చేయాలని స్పష్టం చేయనుంది.

తగిన నాణ్యత ప్రమాణాలతో ట్రాకింగ్‌ పరికరాలను సరఫరాచేసే డీలర్లకు రవాణాశాఖ గుర్తింపునిస్తుంది. ఒక ట్రాకింగ్‌ పరికరం ధర రూ.4 వేల నుంచి రూ.5 వేలలోపు ఉండేలా చూడాలని భావిస్తోంది. వాహన యజమానులకు పెద్దగా ఆర్థికభారం లేకుండానే ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలన్నది రవాణాశాఖ ఉద్దేశం. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు