27న విభజన సమస్యలపై సమావేశం

15 Sep, 2022 03:42 IST|Sakshi

ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ

వివిధ కేంద్ర శాఖల అధికారులు కూడా హాజరు

అజెండాలో ఏపీకి పన్ను రాయితీలు

వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు, రెవెన్యూ లోటు

ఇరు రాష్ట్రాలకు సంస్థల విభజన, బ్యాంకు బ్యాలెన్స్‌ల పంపిణీ

విభజన అంశాలపై దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో ఏపీ ప్రస్తావన

కేంద్ర హోం మంత్రి ఎదుట గట్టిగా వాణిని వినిపించిన రాష్ట్రం

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై కేంద్ర హోం శాఖలో కదలిక వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై  ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గట్టిగా తన వాణిని వినిపించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ నెల 27న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో పాటు అయా అంశాలకు చెందిన కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే సమావేశం అజెండాలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన ద్వైపాక్షిక సమస్యలు, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన పన్ను రాయితీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలున్నాయి.

అజెండాలోని అంశాలు ఇవీ..
ద్వైపాక్షిక సమస్యలు
► విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన
► షెడ్యూల్‌ 10లోని రాష్ట్ర సంస్థల విభజన
► విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థల విభజన
► ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) విభజన
► సింగరేణి కాలరీస్, ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషినరీ అండ్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ విభజన
► ఉమ్మడి సంస్థల్లోని కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెందిన బ్యాంకుల్లోని నగదు నిల్వలు విభజన. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల రుణాల విభజన
► బియ్యం సబ్సిడీకి సంబంధించి  తెలంగాణ పౌర సరఫరాల సంస్థ నుంచి ఏపీ పౌర సరఫరాల సంస్థకు నగదు క్రెడిట్‌  విడుదల

ఇతర సమస్యలు
► ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక పన్ను రాయితీలు
► ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ఉమ్మడి ఏడు జిల్లాల అభివృద్ధి గ్రాంటు
► రెవెన్యూ లోటు
► పన్నుల సమస్యలు
► విద్యా సంస్థల ఏర్పాటు
► నూతన రాజధానికి కేంద్ర మద్దతు
► నూతన రాజధానికి ర్యాపిడ్‌ రైల్‌ కనెక్టివిటీ  

మరిన్ని వార్తలు