ఈ సినిమాతో మరింత దగ్గరవుతా

15 Sep, 2022 03:39 IST|Sakshi

‘‘నా గత చిత్రాల్లో నేను రెండు షేడ్స్‌ ఉన్న పాత్ర చేయలేదు. కానీ తొలిసారి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమాలో చేశాను. ఒకటేమో ఎనర్జిటిక్‌ మాస్‌ అయితే మరొకటి సెటిల్డ్‌గా ఉంటుంది. హీరోగా సెటిల్‌ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరీర్‌కి చాలా బూస్టప్‌ ఇస్తుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాఅనే నమ్మకం ఉంది’’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు.

శ్రీధర్‌ గాదె దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, సంజన ఆనంద్‌ జంటగా తెరకెక్కిని చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య దీప్తి నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం పంచుకున్న విశేషాలు...

దర్శకుడు కోడి రామకృష్ణగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన ‘అమ్మోరు, అరుంధతి’ వంటి సినిమాలు చూసి పెరిగాను. ఆయనతో పనిచేసే అవకాశం రాకపోయినా, ఆయన కుమార్తె దివ్య దీప్తి గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ కి ముందే ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఓకే అయింది. అయితే లాక్‌డౌన్‌ వల్ల ఆలస్యం అయింది. దివ్య దీప్తి సహకారం వల్లే ఈ సినిమా అనుకున్నదాని కంటే బాగా వచ్చింది. కథ డిమాండ్‌ మేరకు ఈ మూవీలో డైలాగ్స్‌ నేనే రాశాను.

కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాయింట్‌ని చర్చించాం. సరికొత్త కథ అని చెప్పను కానీ, మన అందరి ఇంట్లో జరిగే కథలా ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డిగారు హీరోయిన్‌ తండ్రిగా ఇన్నోసెంట్‌ పాత్ర చేశారు. ఇందులోని తండ్రీకూతుళ్ల ఎమోష ్సకు ఆడియ ్స బాగా కనెక్ట్‌ అవుతారు.

ఈ మూవీలో మణిశర్మగారి సంగీతం, నేపథ్య సంగీతం నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటాయి. మా సినిమా ట్రైలర్‌ను పవన్‌ కల్యాణ్‌గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి, రవితేజగార్లలా మాస్‌ పాత్రలు చేయాలని ఉంది.

నేను ఇప్పటి వరకూ చేసిన ‘రాజావారు రాణిగారు, ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం, సెబాస్టియన్, సమ్మతమే’ చిత్రాల్లో ‘సెబాస్టియన్‌’ ఒక్కటే నన్ను నిరుత్సాహ పరిచింది. ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు ఉండటంతో విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావడం కష్టంగా ఉంది(నవ్వుతూ)

గీతా ఆర్ట్స్‌లో చేస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీ మేకర్స్‌లో చేస్తున్న ‘మీటర్‌’ సినిమాల షూటింగ్స్‌ పూర్తయ్యాయి. ఏయమ్‌ రత్నం బ్యానర్‌లో చేస్తున్న ‘రూల్స్‌ రంజన్‌’ సినిమా 40% షూటింగ్‌ అయ్యింది. శ్రీధర్‌ గాదెతో మరో చిత్రం చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు