మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి

16 Dec, 2023 05:35 IST|Sakshi

అణగారిన వర్గాలకు పౌష్టికాహార పంపిణీకి ఇబ్బందులు 

బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణుల్ని దృష్టిలో పెట్టుకుని సహకరించండి 

అంగన్‌వాడీ నేతలతో చర్చల్లో మంత్రుల వినతి 

వేతన పెంపునకు పట్టుబట్టిన యూనియన్‌ నేతలు 

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతిపాదించిన అనేక అంశాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లు పలు డిమాండ్లపై సమ్మెచేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం శుక్రవారం మరోదఫా సానుకూలంగా చర్చలు జరిపింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కె.వి.ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నేతలతో చర్చలు జరిపారు.

యూనియన్‌ నేతలు ప్రస్తావించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు వివరించారు. ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించిందన్నారు. కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్‌ను ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. హెల్పర్లకూ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్‌ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయించిందన్నారు.

సహాయకులకు అంగన్‌వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్‌ కోసం గరిష్ట వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించిందని తెలిపారు. కార్యకర్తలకు టీఏ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించిందని తెలిపారు. గ్రాట్యుటీ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో లేఖరాశామని, దానిపైన కూడా కేంద్రం ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు
గతంతో పోల్చుకుంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే అంగన్‌వాడీ కార్యకర్తలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక వేతనాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7 వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి పనితీరు కనబర్చిన వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఇస్తున్నామని, ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు.

2013 నుంచి అంగన్‌వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. 560 గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీచేసిందన్నారు. సూపర్‌వైజర్‌ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించిందని, నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వర్తింపజేసిందని వివరించారు.

రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్‌ ఫోన్లు అందించిందని, డేటా చార్జీల కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు రూ.2 లక్షల జీవిత బీమాను వర్తింపజేస్తోందని, రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించిందని చెప్పారు. అంగన్‌వాడీల్లో కూడా మంచి వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నాడు–నేడు ద్వారా అనేక చర్యలు చేపట్టిందన్నారు. గతంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశతోపాటు వర్కర్లు, హెల్పర్లకు ఎంతో మేలు జరిగిందనే విషయాన్ని గుర్తించాలని కోరారు.

తాజాగా ప్రతిపాదించిన అనేక అంశాలపైనా  సానుకూలంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అత్యంత అణగారిన వర్గాలకు చెందిన వారికి పౌష్టికాహార పంపిణీ సమ్మె కారణంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్నీ అంగీకరించినప్పటికీ ఒక్క వేతనం పెంపు విషయంలోనే అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు పట్టువీడకపోవడం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు