వామ్మో...ఎండలు! 

31 Jul, 2022 11:48 IST|Sakshi

కడప కల్చరల్‌: ఇవేమి ఎండలలు నాయనా..ఈ మధ్య కాలంలో ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు...అంటూ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. దాదాపు నెల రోజులుగా తేలికపాటి వర్షంతో వాతావరణం చల్లగానే ఉంది. వేసవి తాపం నుంచి బయట పడ్డామని భావించిన ప్రజలకు ఇటీవలి ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచినా వెంటనే తీక్షణమైన ఎండ చిటపటలాడిస్తోంది. ఊహించని విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట తీవ్రమైన ఎండలను భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

ఉభయ జిల్లాల్లో నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 9 గంటలకే బయట కొద్దిసేపు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు రోజులు వాతావరణంలో 35–37 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఇళ్లలో ఫ్యాను, ఏసీ వాడక తప్పడం లేదు. పాఠశాలల విద్యార్థులు ఉదయం ప్రార్థన చేసేందుకు కూడా ఎండ ఆటంకంగా నిలుస్తోంది. వీధుల్లో వెళ్లే ప్రజలు గొడుగులు, టోపీలు, టవళ్లు వాడక తప్పడం లేదు. ట్రాఫిక్‌ కూడళ్లలో సిగ్నల్స్‌ పడేంత వరకు వాహనదారులకు ఎండలో ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. 

నిపుణులు ఏమంటున్నారంటే.. 
రుతు పవనాల్లో ఏర్పడిన అంతరాయం వల్లే ఆకస్మిక ఎండలను ఎదుర్కోవాల్సి వస్తోందని యోగివేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.కృష్ణారెడ్డి చెబుతున్నారు.కొద్దిరోజులు వర్షాభావ స్థితి ఉండడం, తాత్కాలికంగా ఈశాన్యం నుంచి వేడిగాలులు వస్తుండడంతో రాయలసీమ ప్రాంతంలో సాధారణ వాతావరణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు.

మరిన్ని వార్తలు