బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్తే టీడీపీ దౌర్జన్యం చేసింది: వాసిరెడ్డి పద్మ

22 Apr, 2022 14:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అయితే అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే.. టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వస్తే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మహిళల పట్ల రాజకీయం చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌పై బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారనని విమర్శించారు. తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 
సంబంధిత వార్త👉ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టీడీపీ కార్యకర్తల వీరంగం.. వాసిరెడ్డి పద్మపై దాడి

ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఆసుపత్రికి వచ్చే సరికి తెలుగు దేశం నాయకులు ఆసుపత్రి ముందు మోహరించి ఉన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వస్తున్నాడని నన్ను వెళ్లడానికి వీళ్లేదని అడ్డుకోవడమే కాదు, వాసిరెడ్డి పద్మ గో బ్యాక్‌ అంటూ గొడవ చేశారు. అయినా నేను ఆసుపత్రి వద్ద రాజకీయాలు చేయడం సరికాదని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాను. టీడీపీ నేతలను నెట్టుకుంటూ, వారి నుంచి తప్పించుకొని లోపలికి అడుగుపెట్టాను. ఆ తరువాత కూడా టీడీపీ కార్యకర్తలు దాదాపు 50 మంది గలాటా సృష్టించారు. 

అయినా కూడా సంయమనం పాటించా. బాధితురాలితో మాట్లాడుతుండగా బోండా ఉమా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాతో చాలా అనుచితంగా ప్రవర్తించారు. చంద్రబాబు  సైతం విచక్షణ మరిచి బెదిరించే ప్రయత్నం చేశారు. ఆయన సమక్షంలోనే టీడీపీ మహిళా నేతలు నాపై వేలు చూపిస్తూ దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు అందరినీ రెచ్చగెడుతున్నారు. మహిళా నాయకుల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడిన వాసిరెడ్డి పద్మ,  బొండా ఉమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు