విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని మాయ.. వెన్న నుంచి కమిషన్లు

12 Aug, 2021 15:34 IST|Sakshi

వెన్న నుంచీ కమీషన్లు పిండారు

అవసరం లేకపోయినా  2,500 టన్నుల వెన్న కొనుగోళ్లు

కోల్డ్‌స్టోరేజీలో పెట్టి అద్దె కడుతున్న వైనం

1,500 టన్నుల  వెన్న మిగిలిపోయే పరిస్థితి

అనామక సంస్థల నుంచి పాల పౌడర్‌ కొనుగోళ్లు 

అంతులేని అక్రమాలు.. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలకు ఆలవాలంగా మారిన విజయ డెయిరీలో రోజుకో అక్రమాల చిట్టా బయటపడుతోంది. భూముల కొనుగోలులో చేతివాటం మొదలుకొని.. రూ.కోట్లలో నిధులను మింగేయడం.. కమీషన్ల దందా నడిపించడం.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాల పుట్టలెన్నో విజయ డెయిరీ ప్రతిష్టను మసకబారుస్తోంది. తాజాగా వెన్న, పాల పౌడర్‌ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారం బట్టబయలు కావడంతో పాల సొసైటీల చైర్మన్లు అవాక్కవుతున్నారు.

సాక్షి, అమరావతి: వెన్న నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు. కానీ.. విజయ డెయిరీలో మాత్రం వెన్న నుంచి కమీషన్లు కూడా పిండారు. డెయిరీని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్టు ఆ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆయన హయాంలో ప్రతి వ్యవహారం అవినీతిమయంగా మారిందని పాడి రైతులు వాపోతున్నారు. తాజాగా వెన్న, పాల పౌడర్‌ కొనుగోళ్ల తీరు తెలుసుకుని పాల సొసైటీల చైర్మన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అవసరం లేకపోయినా వీటిని భారీగా కొనుగోలు చేసి కమీషన్ల రూపంలో రూ.కోట్లు మింగేశారని చెబుతున్నారు.

గతంలో రెండు నెలలకు ఒకసారి అవసరాన్ని బట్టి వెన్న, పాల పౌడర్‌ కొనేవారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా మంచి పేరున్న సంస్థల నుంచే కొనుగోలు చేసేవారు. డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు కొద్దినెలల క్రితం 2,500 టన్నుల వెన్నను మద్రాసుకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా ప్రైవేట్‌ కంపెనీల నుంచి కొనుగోలు చేయించారు. ఇదికాకుండా సంస్థలో మరో 500 టన్నుల వెన్న తయారైంది. మొత్తం 3 వేల టన్నుల వెన్న విజయ డెయిరీ వద్ద నిల్వ ఉంది. ఇంత వెన్న ఒకేసారి కొనుగోలు చేయడం అంటే కమిషన్‌ కోసమే తప్ప వేరే ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది. ఎంత పక్కాగా నిల్వ చేసినా సంవత్సరం లోపు మాత్రమే దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా కమిషన్‌ కోసం ఒకేసారి భారీగా కొనేశారు.

అప్పు చేసి కొని.. కోల్డ్‌ స్టోరేజీల్లో దాచారు
యాక్సిస్‌ బ్యాంక్‌ ఇచ్చిన రుణంలో సుమారు రూ.75 కోట్లను వెచ్చించి వెన్న కొన్నారు. తర్వాత దాన్ని విశాఖ, హైదరాబాద్‌లోని కోల్డ్‌ స్టోరేజీల్లో భద్రపరిచారు. స్థానిక కోల్డ్‌ స్టోరేజీల్లో అయితే ఎక్కువ అద్దె కట్టాల్సి వస్తుందని, అందుకే ఆ నగరాల్లోని కోల్డ్‌ స్టోరేజీల్లో పెట్టినట్టు సమర్ధించుకుంటున్నారు. అసలు కొనడమే అనవసరమని రైతులు వాపోతుంటే కొని ఎక్కడో కోల్డ్‌ స్టోరేజీల్లో పెట్టామని చెప్పుకోవడం ఏమిటనే ప్రశ్నలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు సుమారు వెయ్యి టన్నుల వెన్నను అతికష్టం మీద వినియోగించారు. రాబోయే రెండు నెలల్లో మహా అయితే మరో 500 టన్నులు వినియోగించే అవకాశం ఉంది. ఇంకా 1500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి ఉంది. చివర్లో దీన్ని చిన్న డెయిరీలకు ఎంతోకొంతకు అమ్మి వదిలించుకోవాల్సిందే. దీనివల్ల సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లనుంది. చైర్మన్‌కు మాత్రం ముందే భారీగా లాభం సమకూరింది. 

పాల పొడి కొనుగోళ్లలోనూ కమీషన్ల పర్వం
పాల పొడి కొనుగోళ్లలోనూ ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించి కమీషన్లు దండుకుంటున్నారు. సహకార రంగంలో ఉన్న అమూల్‌ వంటి పెద్ద సంస్థల నుంచి గతంలో పౌడర్, వెన్న కొనేవారు. ఆంజనేయులు చైర్మన్‌ అయ్యాక పెద్ద సంస్థల నుంచి నామమాత్రంగా కొంటూ ఎక్కువ భాగాన్ని నాసిరకం సరుకు ఇచ్చే ప్రైవేట్‌ సంస్థల నుంచి కొంటున్నారు. హర్యానా ఫుడ్స్, బోయీ బాబా, స్టెర్లిన్‌ ఆగ్రో, మధు డైరీస్‌ వంటి సంస్థల వద్ద వీటిని కొనడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్టే. కానీ.. కమీషన్లు భారీగా ముడుతుండటంతో చైర్మన్‌కు అవే పెద్ద సంస్థలుగా కనబడుతున్నాయి. కమీషన్ల కక్కుర్తి వల్ల విజయ బ్రాండ్‌ మసకబారుతోందని రైతులు వాపోతున్నారు. విజయ పాల నాణ్యత తగ్గిపోవడానికి ఇవే కారణాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత పాలకవర్గాన్ని సాగనంపకపోతే విజయ డెయిరీ పరువు గంగలో కలిసిపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు