సోషల్‌ మీడియా కార్యకర్తలకు గుర్తింపు

10 Mar, 2022 03:54 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

ప్రత్యేకంగా యాప్‌.. అందరికీ సభ్యత్వ కార్డులు 

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి 

ప్లీనరీ అనంతరం విస్తృతంగా పార్టీ సభ్యత్వ నమోదు

పార్టీ రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి కమిటీల పునఃనిర్మాణం 

ఇకపై కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తాం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సోషల్‌ మీడియా కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని, వారికి తగిన గుర్తింపు ఇచ్చి, ప్రోత్సహిస్తామని ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. కొంత మంది సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకుంటామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల 2024లోనూ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యకర్తలతో దాదాపు మూడు గంటలపాటు సమావేశమై వారి అభిప్రాయాలను సావధానంగా విన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ తనను ఆదేశించారన్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి సేవకులో.. తానూ అదే విధంగా పార్టీకి సేవకుడినేనని స్పష్టం చేశారు. వారు లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..

ప్రతి మండలానికి ఇన్‌చార్జ్‌
► రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికి, నియోజకవర్గానికి, పార్ల్లమెంట్‌ నియోజకవర్గానికి సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ను నియమిస్తాం.
► జూలై 8న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తాం. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి కమిటీలను పునఃనిర్మాణం చేస్తాం. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ సభ్యత్వ నమోదు సాధారణ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఇతర పార్టీల కంటే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయాలి. 
► పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించి, టీడీపీ అన్యాయాలను, చంద్రబాబు దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. వీరి కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తాం. పార్టీ కార్యకర్తల తరహాలోనే సోషల్‌ మీడియా కార్యకర్తలకు సభ్యత్వ కార్డులు ఇస్తాం.

ప్రతిపక్షాలు మాత్రమే టార్గెట్‌ 
► సోషల్‌ మీడియా కార్యకర్తలు కోరినట్లుగా సభ్యత్వం తీసుకున్న వారికి బీమా కల్పించే అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయాలే కానీ ఎగ్జిక్యూటివ్స్‌ను, జ్యూడిషియరీని టచ్‌ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు సోషల్‌ మీడియా కార్యకర్తలపై ఎవ్వరూ కేసులు పెట్టే అవకాశం ఉండదు. 
► ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం సాగించాలి. వ్యక్తిగత దూషణలు అవసరం లేదు. ఇకపై కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తాం. పార్టీ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ కూడా ఏర్పాటు చేస్తాం. కార్యకర్తలకు ఏ సహాయం కావాలన్నా చేస్తాం. 
► ఈ సమావేశానికి సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు