హెల్త్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. జరిగేది అప్పుడే!

25 Dec, 2021 15:48 IST|Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ 22, 23వ స్నాతకోత్సవాలు జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. మెరిట్‌ విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్, పీహెచ్‌డీలు, మెడల్స్, బహుమతులు అందిస్తున్నట్టు చెప్పారు. మెడల్స్, బహుమతులకు ఎంపికైన వారి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. ఈ నెల 8న జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.    

టెన్త్‌ విద్యార్థులకు ‘సర్టిఫికెట్‌’ ఇవ్వాలి
నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: పదో తరగతి పూర్తయిన తర్వాత వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని.. వారి కోసం మార్కుల మెమోతో పాటు కోర్స్‌ కంప్లీట్‌ సర్టిఫికెట్‌ కూడా ఇవ్వాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు.

అలాగే ఇంటర్‌లో లాంగ్వేజెస్‌తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు గ్రూప్‌లో ఉంటున్నందున.. పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు పాస్‌ అయిన వారికి ఇంటర్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. దీని వల్ల డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు.

మరిన్ని వార్తలు