అంబేడ్కర్‌ చిత్రపటాన్ని కాల్పించిన టీచర్‌కు దేహశుద్ధి

7 Jul, 2022 04:07 IST|Sakshi
ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న గ్రామస్తులు

గుంటూరు జిల్లా పెదపులివర్రులో ఘటన 

పెదపులివర్రు (భట్టిప్రోలు): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని విద్యార్థులతో ముక్కలు చేయించి, కాల్పించిన ఉపాధ్యాయుడికి పెదపులివర్రు గ్రామస్తులు బుధవారం దేహశుద్ధి చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులోని నాదెళ్ల సుబ్బరాయచౌదరి ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు వి.నరసింహారావు ఏప్రిల్‌ 14న విద్యార్థులతో అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ముక్కలు చేయించి, కాల్పించాడు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు.

హైస్కూల్‌ స్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభమైనా సమస్య పరిష్కారమవలేదు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఉపాధ్యాయుడు నరసింహారావుకు బుధవారం దేహశుద్ధి చేశారు. గొరిగపూడి పంచాయతీ వరికూటివారిపాలేనికి చెందిన నరసింహారావు మొదటి నుంచీ ఎస్సీ విద్యార్థులపై వివక్ష చూపే వాడని, చితకబాదేవాడని గ్రామస్తులు ఆరోపించారు. విద్యార్థుల మధ్య కుల చిచ్చు పెడతాడని తెలిపారు.  

పోలీసులు గ్రామానికి చేరుకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని హైస్కూల్‌ గదిలో ఉంచారు. బాపట్ల డిప్యూటీ డీఈవో ఎం. వెంకటేశ్వర్లు కూడా అక్కడికి వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుడు నరసింహారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖాధికారులు ప్రకటించారు. ఇందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు.

అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ముక్కలు చేసి కాల్పించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రిసిటీ యాక్ట్‌ – 2015 ప్రకారం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుడిచే అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పాలాభిషేకం చేయించి, క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు భీష్మించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  సాయంత్రం 6:30 గంటలకు బాపట్ల డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8:30 గంటల వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

చివరకు పోలీసులు గ్రామస్తులను చెల్లా చెదురు చేశారు. ఆ తరువాత ఉపాధ్యాయుడు నరసింహారావును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తునకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బుస్సా నాగరాజు, వేమూరు నియోజకవర్గ కన్వీనర్‌ గద్దె యతీష్, ఆలిండియా షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి యన్నం సురేష్‌  డిమాండ్‌ చేశారు. నరసింహారావుకు సహకరించిన మరో పీఈటీ వి.శ్రీనివాసరావుపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు