పేరు సరే.. ఊరేది?

26 Jul, 2020 03:06 IST|Sakshi

ప్రభుత్వ రికార్డుల్లో పేర్లున్నా భౌతికంగా కనిపించని ఊర్లు

వందల ఏళ్ల క్రితమే కనుమరుగైన పలు గ్రామాలు

ఇప్పటికీ పంచాయతీ కేంద్రాలు, రెవెన్యూ గ్రామాలకు అవే పేర్లు

వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా వందల్లో శిథిల గ్రామాలు

సాక్షి ప్రతినిధి కడప: ఆ పంచాయతీ పేరు రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. పంచాయతీ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ భౌతికంగా ఆ ఊరు మాత్రం కనపడదు. ఆ ఊరికే ప్రస్తుతం వేరే పేరు స్థిరపడిపోయి ఉంటుంది. కొత్త పేరునే స్థానికులు వినియోగిస్తుంటారు. గతంలో ఓ వెలుగు వెలిగిన వందలాది గ్రామాలు శిథిల శకలాలుగా మిగిలి నేడు కనుమరుగైపోయాయి. ఆనాటి గ్రామాల్లో నివసించిన వారు కొత్తగ్రామాలను ఏర్పాటు చేసుకోవడమో, ఇతర గ్రామాలకు వలసవెళ్లిపోవడమో, పేరు మార్చుకోవడమో జరిగింది. ఇలాంటి గ్రామాలు వైఎస్సార్‌ జిల్లాలో వందలాదిగా ఉన్నాయి. ఉదాహరణకు కత్తెరగండ్ల అనే పెద్ద గ్రామం పూర్వం ఉండేది. కాలక్రమంలో ఆ గ్రామం కనుమరుగైపోయి చిన్న గ్రామాలుగా విడిపోయింది. ప్రస్తుతం రికార్డుల్లో కత్తెరగండ్ల ఉన్నా.. ఆ పంచాయతీ కార్యాలయం చెన్నవరం అనే గ్రామంలో ఉంటుంది. కత్తెరగండ్లకు బదులుగా చెన్నవరం పేరునే స్థానికులు వినియోగిస్తారు. బందిపోట్లు, దివిటి దొంగల దాడులు, పాలెగాళ్ల ఒత్తిళ్లు, ఫ్యాక్షన్‌ గొడవలు, కలరా లాంటి వ్యాధులు, సాగు, తాగునీరు లేకపోవడం తదితర కారణాలతో ఆనాటి ఊళ్లు ఖాళీ అయిపోయాయని చరిత్రకారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉండి భౌతికంగా లేని ఊళ్లు జిల్లాలో 100కు పైగా ఉంటే.. రికార్డుల్లో లేకుండా పూర్తిగా కనుమరుగైన ఊళ్లు దాదాపు 500 ఉంటాయని అధికారులు చెబుతున్నారు.  

ఒక్కో ఊరిది ఒక్కో కథ..
► కాలగర్భంలో కలసిపోయిన ఒక్కో ఊరిది ఒక్కో కథ..
► బద్వేలు ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలు అదృశ్యమైపోయాయి. 
► శ్రీఅవధూత కాశినాయన మండలంలోని కత్తెరగండ్ల కృష్ణదేవరాయల కాలంలో కుటీరపరిశ్రమలతో అలరారింది. ఈ ఊరు ఇప్పుడు శిథిలమైపోయింది. ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోంది.  
► 13వ శతాబ్ది నుంచి రంపాడు అనే గ్రామం ఉంది. దండుబాటల కారణంతో దోపిడికి గురై గ్రామం కిలపడిపోయింది. కాలక్రమంలో ధర్మారంపాడు, పాపిరెడ్డిపల్లె, కొండపేట, లక్ష్మిగారిపల్లె తదితర గ్రామాలుగా మార్పు చెందింది. ఇప్పటికీ రంపాడు పేరుతోనే రికార్డులు ఉన్నాయి. 
► గతంలో సిరులతో అలరారిన అక్కెంగుండ్ల గ్రామం దొంగల దాడులతో కాలగర్భంలో కలసిపోయింది. 
► వాసుదేవాపురం, పగడాలపల్లె, నీలాపురం, టి.శేషంపల్లె, సంచర్ల, అనంతరాజుపురం గ్రామాల పేర్లు ఉన్నా ఊళ్లు మాత్రం కనబడవు. 
► జమ్మలమడుగు మండలంలో తూగుట్లపల్లి, పాత కొండాపురం గ్రామాలు దోపిడీ దొంగల దాడులతో పూర్తిగా తుడిచి పెట్టుకునిపోయాయి. ఆనాటి బురుజులు, గంగమ్మ దేవాలయం మాత్రమే నేటి తరానికి సాక్ష్యాలు.
► రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో పలుగ్రామాలు అంతరించి పోయినా పేర్లు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. 

చాలా పెద్దవి
కాశినాయన మండలంలోని రంపాడు, కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల, వాసుదేవపురం తదితర ఐదు రెవెన్యూ గ్రామాలు చరిత్రలో కలిసిపోయాయి. కొన్ని దోపిడి దొంగల దాడులు, వ్యాధులు, క్రూరమృగాల కారణంగా కిలపడిపోయాయి. కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల గ్రామాలు చాలా పెద్దవి. ఒక్కో ఊరిలో వెయ్యికిపైగా కుటుంబాలుండేవి. వ్యవసాయం, పశుపోషణ, పరిశ్రమలతో కళకళలాడేవి. నేడు అవి పేర్లకే పరిమితయ్యాయి.
– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, నవల, కథా రచయిత, కాశినాయన మండలం

రెవెన్యూ రికార్డుల్లోనే ఉంది
అంబవరం పంచాయతిలో తూగుట్లపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన పొలాల వివరాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామం ఆనవాలు ఎక్కడ కనిపించదు. ఒక్క ఇల్లు కూడాలేదు.
– శ్రీనివాసులు, వీఆర్వో, అంబవరం పంచాయతి.

దోపిడీలతోనే గ్రామాలు ఖాళీ 
బందిపోట్లు, దివిటి దొంగల దాడులతో అటవీ శివారు గ్రామాలు ఖాళీ కాగా, జబ్బులు, నీటి వసతి లేక, ఫ్యాక్షన్‌  గొడవలు, పాలెగాళ్ల దాడులతో కొన్ని గ్రామాలు కనుమరుగయ్యాయి. బందిపోట్లను ఎదుర్కొని నిలిచిన కొన్ని గ్రామాలు మాత్రమే కొండ ప్రాంతాల్లో ఉండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామాలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతుంది.
– తవ్వా ఓబుల్‌రెడ్డి, చరిత్ర పరిశోధకులు, మైదుకూరు

మరిన్ని వార్తలు