బాలిక కడుపులో వెంట్రుకల ముద్ద

29 May, 2022 09:58 IST|Sakshi

ఆరిలోవ(విశాఖ తూర్పు): తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న బాలికకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి స్వస్థత చేకూర్చారు వైద్యులు. విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)లో ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేశారు. విమ్స్‌ డైరెక్టర్‌ కె.రాంబాబు తెలిపిన వివరాలివి..  

రాజమండ్రికి చెందిన 13 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడేది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా తగ్గకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న విశాఖలో విమ్స్‌కు తీసుకు వచ్చారు. ఇక్కడి వైద్యులు ఆ బాలికకు ఎండోస్కోపీ చేసి కడుపు లోపల వెంట్రుకలతో కూడిన పదార్థం ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని ట్రైకోబెజార్‌ వ్యాధిగా నిర్థారించారు. దీంతో ఈ నెల 23న లాప్రోస్కోపిక్‌ సర్జరీ చేసి బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలతో ఉన్న 300 గ్రాముల పదార్థాన్ని తొలగించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న బాలికను శనివారం డిశ్చార్జి చేశారు.  

50 ఏళ్లలో 68 మందికి మాత్రమే.. 
ఇలాంటి వ్యాధి అరుదుగా వస్తుందని విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు తెలిపారు. 50 ఏళ్లలో దేశంలో 68 మందికి మాత్రమే ఈ తరహా శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. విమ్స్‌లో చిన్నారికి జరిగిన సర్జరీ 68వది అని తెలిపారు. సర్జరీ విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్‌ చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడారని విమ్స్‌ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్‌ స్రవంతి బృందం, విమ్స్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు.  

(చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్‌ క్రాఫ్ట్‌)

మరిన్ని వార్తలు