అఖిల్‌ను వెంటపడవద్దని హెచ్చరించినా..

1 Nov, 2020 19:28 IST|Sakshi

వరలక్ష్మి కుటుంబీకులకు వాసిరెడ్డి పద్మ పరామర్శ

యువతులు దిశా యాప్‌ను ఉపయోగించండి

విద్యార్థులు కౌన్సిలింగ్ అవసరం

సాక్షి, విశాఖ : ఉన్మాది చేతితో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గాజువాక శ్రీనగర్ కాలనీలో వరలక్ష్మి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ‘వరలక్ష్మి హత్య అమానుషం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. దిశ చట్టం ప్రకారం నిందితులపై పోలీసులు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. నిందితులకు దిశ చట్టం ద్వారా కఠినమైన శిక్ష పడుతుంది. ఏడాది క్రితం అఖిల్‌ను తమ కుమార్తె వెంట పడవద్దని వరలక్ష్మి కుటుంబీకులు హెచ్చించినా అతడి వైఖరి మారలేదు. అయినా ఈ దారుణానికి ఒడిగట్టాడు.
(చదవండి : పక్కా ప్లాన్‌తోనే వరలక్ష్మిని హత్య చేశాడు..)

ఈ హత్యలో అఖిల్‌ తండ్రి పాత్రపైన కూడా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆపదలో ఉన్న యువతులు దిశ యాప్‌ను వినియోగించుకోవాలి. ప్రేమ పేరిట దాడుల నియంత్రణకు విద్యార్థులకు కౌన్సిలింగ్‌ అవసరం. ఇలాంటి ఘటనకు కారణమైన అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది. బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 10 లక్షల పరిహారం ప్రకటన  ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే.’ అని అన్నారు.
(చదవండి : వరలక్ష్మి హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు)

ఈ ఘటనను విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి కురసాల కన్నబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం పోలీసు అధికారులు వెంటనే స్పందించిన తీరును అభినందించారు. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా సమాజంలో అన్ని వర్గాలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.  మరోవైపు పోస్ట్‌మార్టం అనంతరం వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. విగతజీవిగా ఉన్న కూతురిని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

వరలక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న హోమంత్రి సుచరిత
మోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హోంమంత్రి మేకతోటి సుచరి ఈ రోజు రాత్రి విశాఖపట్నంకు బయలుదేరారు. రేపు ఉదయం 10 గంటలకు గాజువాక చేరుకొని వరలక్ష్మి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. ఇప్పటికే దాడి చేసిన ప్రేమోన్మాది అఖిల్ సాయి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు