విద్యుత్‌ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు

7 Jul, 2022 19:07 IST|Sakshi
సింహాద్రి ఎన్టీపీసీ ముఖచిత్రం

సింహాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఘనత

జూలై 8న వ్యవస్థాపక దినోత్సవం

పరవాడ(పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో 1997లో ఏర్పాటు చేసిన సింహాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఈ నెల 8న 26వ ఏటలో అడుగుపెట్టబోతుంది. పరవాడ సమీపంలో 3,283 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,700 కోట్ల వ్యయంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్‌ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2007 నుంచి రెండు విడతలుగా రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాయికి చేరుకుంది.

బొగ్గు ఆధారంగా నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మేటిగా నిలిచి మహారత్న బిరుదును సార్థకం చేసుకున్న ఘనత సింహాద్రి ఎన్టీపీసీకే దక్కుతుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు సద్వినియోగం చేసుకొంటున్నాయి. నీటిపై తేలియాడే సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌కు 2020లో శ్రీకారం చుట్టింది.  

సింహాద్రి ఆధ్వర్యంలో స్థానిక రిజర్వాయర్‌పై రూ.110 కోట్ల వ్యయంతో 25 మెగావాట్ల తేలియాడే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి.. 2021 ఆగస్టు 21 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించింది. సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను సింహాద్రి ఎన్టీపీసీ తన సొంత అవసరాలకు వినియోగించుకుంటోంది.  
     
దీపాంజిలినగర్‌ టౌన్‌షిప్‌లో సముద్రిక అతిథి గృహం ప్రాంగణంలో గతేడాది 30న రూ.9కోట్ల వ్యయంతో హరిత హైడ్రోజన్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే తొలి పైలట్‌ ప్రాజెక్ట్‌కు భూమి పూజ జరిగింది.  
     
50 కిలోవాట్ల సామర్థ్యం గల స్టాండ్‌లోన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత హరిత హైడ్రోజన్‌ మైక్రోగ్రిడ్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన బ్లూమ్‌ ఎనర్జీ సంస్థకు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సరఫరా కానున్న విద్యుత్‌ను సముద్రిక అతిథి గృహం అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.  
     
ప్లాంట్‌ ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన రెండు కూలింగ్‌ టవర్ల కాల పరిమితి తీరిన నేపథ్యంలో వాటిని తొలగించి.. నూతనంగా మరో రెండు కూలింగ్‌ టవర్ల నిర్మాణానికి రెండేళ్ల కిందట సంస్థ శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి రూ.186 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం కూలింగ్‌ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
     
సింహాద్రిలో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం 30 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. ఈ బొగ్గు నిల్వల ను ఒడిశాలోని తాల్చేరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
     
విద్యుత్‌ ఉత్పత్తి కోసం బొగ్గును మండించే క్రమంలో విడుదలవుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

సంస్థలో 600 మంది శాశ్వత ఉద్యోగులు, రెండు వేలకు పైగా కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తూ నాణ్యమైన విద్యుదుత్పాదనకు తమ వంతు కృషి చేస్తున్నారు.  

బాలికా సాధికారతకు కృషి  
సింహాద్రి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బాలిక సాధికారత కోసం ఈ ఏడాది రూ.45      లక్షలు ఖర్చు చేశాం. నిర్వాసిత గ్రామాల నుంచి 125 మంది బాలికలను ఎంపిక చేసి వారికి దీపాంజిలినగర్‌ టౌన్‌షిప్‌లో ప్రత్యేక వసతి కల్పించి.. ఆరు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారిలో ఉత్సాహవంతులైన 10 మంది బాలికలను ఎంపిక చేసి టౌన్‌షిప్‌లోని బాలభారతి పబ్లిక్‌ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఉచితంగా విద్యనందించేందుకు ఏర్పాట్లు చేశాం. నిర్వాసిత గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం, విద్య వంటి అభివృద్ధి పనులకు సీఎస్సార్‌ ద్వారా అత్యధిక నిధులను కేటాయిస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం.         
– జి.సి.చౌక్సే, సీజీఎం, సింహాద్రి ఎన్టీపీసీ  

మరిన్ని వార్తలు