బసవన్నకు ‘వీక్లీ ఆఫ్‌’.. ఎక్కడ? ఎప్పుడు అంటే?

15 May, 2022 12:04 IST|Sakshi

కర్ణాటక నుంచి సంక్రమించిన సంప్రదాయం

ఆధునిక కాలంలోనూ ఆనవాయితీ ఆచరిస్తున్న గ్రామస్తులు

మంత్రాలయం/ఆలూరు: గోవులను, ఎడ్లను పూజించడం హిందువుల సంప్రదాయం. ఏరువాక పౌర్ణమి, బసవ జయంతి పర్వదినాలను ఎద్దుల పండుగలుగా భావిస్తారు. ఆయా రోజుల్లో వాటికి స్నానాలు చేయించి, అలంకరణలు గావించి, పిండివంటలు పెట్టి పూజిస్తారు. మనకు ఇంత వరకే తెలుసు. కానీ జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న సుళేకేరి, విరుపాపురం గ్రామాల్లో ఎద్దులను ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. ఇలవేల్పు బసవేశ్వర స్వామి ప్రతి రూపాలుగా భావించి వారంలో ఒక రోజు పూర్తిగా సెలవు ఇచ్చేస్తారు. ఎంత పని ఉన్నా సోమవారం వాటితో చేయించరు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయంపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం.
చదవండి: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్‌

కట్టుబాట్ల సుళేకేరి..
కౌతాళం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుళేకేరి గ్రామంలో అవధూత బంధమ్మవ్వ మహిమాని్వతురాలుగా ప్రసిద్ధి. అవ్వ పరమపదించిన తరువాత గ్రామంలో జాతరతో పాటు కొన్ని కట్టుబాట్లను పాటిస్తూ వస్తున్నారు. అవ్వ జాతరకు నెల రోజుల ముందు ఓ సామాజికవర్గం గ్రామ చావిడిలో చెప్పులు వేసుకుని నడవకపోవడం ఒక సంప్రదాయం కాగా మరొకటి ప్రతి సోమవారం ఎద్దులకు సెలువు ఇవ్వడం.

దాదాపు 4 శతాబ్దాల క్రితం గ్రామంలో రైతులు యథావిధిగా ప్రతి రోజు పొలాలకు వెళ్లి కాడెద్దులతో పనులు చేసుకునేవారు. అయితే సోమవారం ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునేవి. కాడెద్దు చనిపోవడం, కాలు విరగడం, బండి ఇరుసులు, చక్రాలు విరగడం, రైతులకు గాయాలు కావడం జరిగేవి. దీంతో గ్రామంలోని అవధూత బంధమ్మవ్వకు గ్రామస్తులు గోడును వినిపించుకున్నారు. సోమవా రం కాడెద్దులను కష్టపెట్టడం మానేయాలని ఆమె ఆదేశించడంతో ఆ ఆజ్ఞను సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

విరుపాపురంలో విత్తు ఉన్నా సెలవే..
ఆలూరు నియోజకవర్గ కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విరుపాపురం ఉంది. ఆ గ్రామ ఇలవేల్పు బలగోట బసవేశ్వర స్వామి. ఏటా ఏప్రిల్‌ నెలలో వచ్చే హంపయ్య పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర జరుపుకుంటారు. శివుని వాహనం బసవేశ్వరుడు కావడంతో గ్రామస్తులు బసవన్నలను దైవాలుగా పూజిస్తారు. ఇక్కడ 1975లో ఇందిరమ్మ గృహాలు రావడంతో విరుపాపురం పక్కనే బలగోట గ్రామం వెలసింది.

విరుపాపురం గ్రామం రెండు గ్రామాలుగా ఆవిర్భవించడంతో బలగోట బసవేశ్వర స్వామి(బలగోటయ్య తాత) ఆజ్ఞగా భావించి ప్రతి సోమవారం కాడెద్దులకు సెలవు దినంగా ప్రకటించుకున్నారు. దాదాపు 5 శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఆచరిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా ప్రతి సోమవారం కాడెద్దులకు స్నానాలు చేయించడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, పిండి వంటలతో నైవేద్యాలు సమరి్పంచడం చేస్తున్నారు. అదే రోజు బలగోటయ్య స్వామి ఆలయానికి ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలతో ఎద్దులను తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. విత్తు వేసే పనులు ఉన్నా, పెళ్లిళ్లకు మెరవణిలు, ప్రయాణాలు ఉన్నా ఎద్దులతో పనులు చేయించరు.   

మరిన్ని వార్తలు