S Abdul Nazeer: ఏపీ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి.. ఎవరీ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌!

12 Feb, 2023 14:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా సుప్రీకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఏపీతోపాటు  దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బిశ్వభూషన్‌ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్లనున్నారు.

కాగా ఏపీకి మూడో గవర్నర్‌గా రానున్న సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ సుప్రీంకోర్టు మాజీ జడ్జి. గత నెల జనవరిలో పదవీ విరమణ చేశారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ఫకీర్‌ సాహెబ్‌. ముడబిద్రి ప్రాంతంలోని మహవీర కళాశాలలో బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన మంగళూరులోని కొడియాల్‌బైల్‌లోని ఎస్‌డీఎమ్‌  కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు.
చదవండి: ఏపీ నూతన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

హైకోర్టు న్యాయమూర్తిగా
1983లో న్యాయవాదిగా నమోదు చేసుకుని కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరి 17న నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే  దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోషన్‌ పొందిన మూడో న్యాయమూర్తి నజీర్‌ కావడం విశేషం.

కీలక తీర్పులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్‌ పలు కీలక తీర్పులను వెల్లడించారు. ట్రిపుల్‌ తలాక్‌, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి. ముస్లిం షరియా చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ అనుమతించబడుతుందని నజీర్‌తోపాటు మరొ న్యాయమూర్తి సమర్థించారు. అయితే బెంచ్‌లో 3:2 మెజారిటీతో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడాన్ని చట్ట విరుద్దంగా ప్రకటించడంతో ఈ కేసు వీగిపోయింది. 

అయోధ్య రామమందిరంపై తీర్పు
2019లో అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్ నజీర్ కూడా సభ్యుడు. ధర్మాసనంలోని అయిదుగురు జడ్జీలు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగానే తీర్పునిచ్చారు. అయితే రిటైర్‌మెంట్‌కు కొన్ని నెలల ముందు జస్టిస్ నజీర్ రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2016లో రూ.500,1000 నోట్ల రద్దుకు సంబంధించిన కేసులను విచారించింది. జనవరి 4న రిటైర్‌మెంట్‌ అవ్వగా.. నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవికి సిఫారసు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

మరిన్ని వార్తలు