అన్నలకు గృహయోగం

27 Jul, 2022 08:30 IST|Sakshi

వారంతా పోరుబాటలో అడవిబాట పట్టిన అన్నలు. అన్యాయంపై బంధూకు ఎక్కుపెట్టి ప్రజల పక్షాన నిలిచిన విప్లవ వీరులు. కంటి నిండా నిద్రలేక కడుపునిండా తిండిలేక ఇబ్బందులు పడ్డారు. కుటుంబాలకు దూరమై వేదన అనుభవించారు. తిరుగుబాటు యుద్ధంలో ఎందరో తూటాలకు నేలకొరిగారు. కానీ ప్రస్తుతం పాలకులు మారారు..పాలనా మారింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అందుకే వారంతా జనావాసంలోకి వచ్చారు. కుటుంబాలతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అలాంటి ‘మాజీ’లకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అండగా నిలిచింది. నాలుగు ఎకరాల్లో 135 మందికి పట్టాలివ్వగా...వారంతా సొంతింటి కల సాకారం చేసుకుంటున్నారు. 

సాక్షి, పుట్టపర్తి: లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అండగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవించే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు సొంతింటి కలను సాకారం చేస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తి శివారున సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక భాగాన కప్పలబండ పొలాల్లో సుమారు 5 ఎకరాల్లో లోచెర్ల పెద్దారెడ్డి పేరుతో కాలనీ ఏర్పాటు చేసి 135 మందికి పట్టాలిచ్చింది. 

లొంగిపోయి.. జనజీవన స్రవంతిలోకి.. 
ప్రభుత్వాల హామీతో లొంగిపోయిన మాజీ నక్సల్స్‌ జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. అందరిలా జీవించాలనే తపనతో బతుకుతున్నారు. కుటుంబ బాధ్యతలు మీద వేసుకున్నారు. పిల్లలను చదివిస్తున్నారు. రైతులుగా మారి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ చాలా మందికి నిలువ నీడలేదు. దీంతో అంతా కలిసి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు.

పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2021 మే నెలలో పట్టాల పంపిణీ జరిగింది. ప్రస్తుతం అందరూ ఓ కాలనీ ఏర్పాటు చేసుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం కాలనీలో రోడ్డు, విద్యుత్, తాగునీరు సౌకర్యం కల్పించారు. కాలనీ పూర్తి స్థాయిలో ఏర్పడేలోపు ప్రాథమిక పాఠశాలు, కుటీర పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధికి ఇబ్బందులు ఉండవని వారు కోరుతున్నారు.  

అప్పటి బాధలు వర్ణించలేం
అజ్ఞాతంలో భాగంగా  పదేళ్ల పాటు అడవిలో ఉన్నా. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలతో లొంగిపోయాను. ప్రస్తుతం నాపై కేసులేమీ లేవు. వ్యవసాయం చేసుకుంటున్నా. నేను 1999లోనే జన జీవన స్రవంతిలో కలసిపోయాను. అడవిలో ఉన్నప్పటి బాధలు వర్ణించలేనివి. ఎవరికీ అలాంటి బాధలు రాకూడదు. 
– ఆంజనేయులు, బ్రాహ్మణపల్లి, పుట్టపర్తి

ఇల్లు కట్టుకుంటున్నా
నేను 2007లో లొంగిపోయాను. ప్రభుత్వంతో పాటు 
ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తుకుంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం స్థలం మంజూరు చేయగా...ఇల్లు నిర్మించుకుంటున్నా.      – ఎస్‌.శ్రీనివాసులు, అమగొండపాళెం

ప్రభుత్వం గుర్తించింది 
మా అన్న ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. వదిన విశాఖపట్నం జైలులో శిక్ష అనుభవిస్తోంది. నేను 1994లోనే లొంగిపోయాను. నాపై కేసులన్నీ కొట్టేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. పట్టాలిచ్చి మాకంటూ కాసింత నీడనిస్తోంది.          
 – ఎం.రంగనాయకులు, గూనిపల్లి, పుట్టపర్తి  

మంచి రోజులొచ్చాయి 
2007లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో లొంగిపోయాను. వైఎస్సార్‌ హయాంలో ప్రభుత్వ పాలనపై నమ్మకం ఏర్పడింది. ఆయన మరణం తర్వాత కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నా.  
రామాంజి, నార్సింపల్లి, బుక్కపట్నం మండలం 

ప్రభుత్వ కృషి మరువలేనిది 
మా నాన్న లోచెర్ల పెద్దారెడ్డి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ప్రజా ఉద్యమాలు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత నాన్నతో కలిసి నేనూ పదేళ్లు అజ్ఞాతంలో ఉన్నా. 1992లో ప్రజా జీవనంలోకి వచ్చా. కప్పలబండ పొలంలో 4.88 ఎకరాల్లో సుమారు 135 ప్లాట్లు ప్రభుత్వం మాకోసం మంజూరు చేసింది. మాజీ నక్సలైట్ల కాలనీ అని పేరు పెట్టుకున్నాం. అయితే ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి లోచెర్ల పెద్దారెడ్డి కాలనీగా నామకరణం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చొరవ మరువలేనిది.  
– లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి   

మరిన్ని వార్తలు