సంబరంలా వైఎస్సార్‌ చేయూత

30 Sep, 2022 06:00 IST|Sakshi
కె.కోటపాడు సభకు హాజరైన లబ్ధిదారులు (ఇన్‌సెట్లో) మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

చేయూత సభలకు వెల్లువెత్తిన మహిళలు

చెక్కులు అందజేసిన మంత్రులు

సోదరునిలా మహిళలకు సీఎం జగన్‌ మేలు: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

అభివృద్ధి అంటే చంద్రబాబు, రామోజీ బాగుపడటం కాదు: మంత్రి రాజా

రాష్ట్రమంతా సమానాభివృద్ధిని కాంక్షిస్తున్న సీఎం: మంత్రి రమేష్‌

జగనన్న రియల్‌ హీరో: మంత్రి రోజా

సాక్షి నెట్‌వర్క్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ చేయూత పథకం కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా సంబరంగా జరుగుతున్నాయి.  గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంత్రులు ఈ పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలకు మహిళలు వెల్లువలా తరలి వచ్చారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో జరిగిన సభలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి.వి.సత్యవతితో కలిసి 4,885 మందికి రూ.9.15 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల మహిళలకు సొంత సోదరునిలా మేలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

కాకినాడ జిల్లా ఎస్‌.అన్నవరం వద్ద జరిగిన కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి దాడిశెట్టి రాజా రూ.9.89 కోట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల గుండెల్లో సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ సుస్థిరంగా ఉండిపోతారని మంత్రి రాజా చెప్పారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, ఎల్లో మీడియా బాగు పడడం కాదని, రాష్ట్రంలో ప్రజలందరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమని అన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన వైఎస్సార్‌ చేయూత సంబరాల సభలో వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ 13,989 మంది లబ్ధిదారులకు రూ.25.28 కోట్లు అందజేశారు. సీఎం జగన్‌ మూడు రాజధానులతో రాష్ట్రమంతా సమాంతర అభివృద్ధిని కాంక్షిస్తుంటే.. చంద్రబాబు మాత్రం అమరావతే రాజధాని అంటూ తన కులం, కుటుంబీకులు, బంధువుల లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని మంత్రి రమేష్‌ చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడులో జరిగిన సభలో  మంత్రి ఆర్కే రోజా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన 11,530 మందికి రూ.21.69 కోట్లు పంపిణీ చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేది లేదని, జగనన్న తగ్గేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. 

మరిన్ని వార్తలు