కులగణన ఖర్చులకు రూ.10.19 కోట్లు

21 Nov, 2023 05:15 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ జవహర్‌రెడ్డి   

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన కులగణన కోసం రూ.10.19 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కులగణన ప్రక్రియలో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించేందుకు ఎన్యుమరేటర్లుగా వ్యవహరించే ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణతోపాటు ఇతర కార్యక్రమాల ఖర్చులకు గాను ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కులగణన ప్రక్రియ ముగిసే వరకు ఈ కార్యక్రమంలో కీలకంగా పనిచేసే ఉద్యోగులందరికీ ఆరోగ్య సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో మినహా సెలవులు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కులగణన ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నోడల్‌ డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. కులగణన రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం సాంఘిక సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాలు, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, పంచాయతీరాజ్, మున్సిపల్, ప్లానింగ్‌ శాఖల అధిపతులతో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ(ఎస్‌ఎల్‌ఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ కార్యక్రమ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారని తెలిపారు.  

విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులను పూర్తిచేయండి: సీఎస్‌  
రాష్ట్రంలో విదేశీ సాయంతో చేపట్టిన 11 ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎస్‌ సోమవారం విజయవాడలోని తమ నివాస బంగ్లాలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై విదేశీ సాయంతో చేపట్టిన 11 ప్రాజెక్టుల పనుల ప్రగతిని సమీక్షించారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రోడ్లు–భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి, జలవనరులు, పాఠశాల విద్య, పరిశ్రమలు, ఆరోగ్య శాఖలకు సంబంధించి రూ.27,259.52 కోట్లతో చేపట్టిన 11 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు రూ.5,996.97 కోట్ల విలువైన పనులను మాత్రమే నిర్వహించినట్లు సీఎస్‌ తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు