ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై ధ్వజమెత్తిన రోజా

5 Feb, 2021 17:58 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తనకు కావాల్సిన వారినే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా నియమించుకొని, ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం ఎస్‌ఈసీ స్థాయికి సరికాదని ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డకు తనపై తనకే నమ్మకం లేదని, ఆయన చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్‌ ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబును కలిసి, ఓటర్ల జాబితాపై ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారని ఫిర్యాదు చేశారు. గతేడాది అప్‌డేట్‌ చేసిన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోందని ఆరోపించారు. 2019 జనవరి వరకు ఉన్న ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకున్నామని, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎస్‌ఈసీ న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ-వాచ్ యాప్‌ టీడీపీ ఆఫీసులో తయారైందనే అనుమానం ఉంది: బాలశౌరి

న్యూఢిల్లీ: ఎస్‌ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్‌పై అనేక సందేహాలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరీ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ యాప్‌ టీడీపీ ఆఫీసులో తయారైందనే అనుమానం కలుగుతోందని అన్నారు. యాప్‌ ఎక్కడ తయారైందో వెంటనే విచారణ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీ పదవులే ఏకగ్రీవాలవుతుంటే, ఎస్‌ఈసీ సర్పంచ్‌ల ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న నిమ్మగడ్డ.. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మిన వారెవరూ చరిత్రలో బాగుపడినట్లు లేదని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు