కుప్పంకి ప్రత్యేక చట్టాలుండవు బాబూ 

6 Jan, 2023 21:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: కుప్పం తన సొంత నియోజకవర్గమని, ఇక్కడి నుంచి ఏడుసార్లు గెలిచానంటూ పోలీసులపై చంద్రబాబు రుబాబు చేయడంపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. ఈ మేరకు తాడేపల్లిలో గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్‌ షోలు పెట్టవద్దని కుప్పంలో పోలీసులు సలహా ఇచ్చినప్పుడు, చంద్రబాబు వారిపై దురుసుగా ప్రవర్తించడాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలు చూశారన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకచోట నుంచి ఎన్నికైనప్పుడు అది తన సొంత స్థానం.. ఇక్కడ నుంచి అసెంబ్లీకి చాలాసార్లు ఎన్నికయ్యా? కుప్పంలో అంతా నా ఇష్టం? కుప్పంలో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లు మాట్లాడటం ఎంతవరకు సబబని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా, 13 ఏళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబేనా ఇలా ప్రవర్తిస్తోంది అని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.

అమలులో ఉన్న చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నడుచుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. పోలీసు అధికారులు ఇలాంటి విషయాలు ఓ మాజీ సీఎంకి, సీనియర్‌ నేతకు చెప్పాల్సి రావడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఎంత గొప్ప రాజకీయ నాయకుడికైనా తాను పుట్టి,∙పెరిగిన సొంతూరులో గానీ, అత్యధికసార్లు గెలిచిన నియోజకవర్గంలో గానీ ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు ఉండవని స్పష్టంచేశారు. 73 ఏళ్ల చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ రకంగా, ప్రతిపక్ష నేతగా మరోలా వ్యవహరించడం ఆయన విజ్ఞతకు వదిలేయాల్సిందేనని పేర్కొన్నారు. 

చదవండి: (TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా!)

మరిన్ని వార్తలు