Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు

17 Nov, 2023 05:36 IST|Sakshi

మాస్కో: సూపర్‌మార్కెట్‌లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్‌మార్కెట్‌లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్‌ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది.

ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్‌ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్‌ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్‌ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్‌ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.

మరిన్ని వార్తలు