విడ్డూరం: 15ఏళ్ల బాలుడికి అన్నప్రాశన....

25 Oct, 2021 21:00 IST|Sakshi

బాల్యం నుంచి అన్నం ముట్టని వైనం

చాయ్‌బన్, బజ్జి, రోటీయే ఆహారం

సైక్రియాటిస్టుకు చూపినా మారని అలవాటు

15 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల ఆందోళనకు తెర

సంబరపడిన బంధువులు

కర్నూలు (ఓల్డ్‌సిటీ): పదో తరగతి బాలుడికి అన్నప్రాశన జరిగిందంటే నమ్మశక్యం కావడం లేదు కదా... కానీ ఇది నిజం.. పాతబస్తీలో ఆటో నడుపుకుని జీవనం కొనసాగించే సాబిర్‌ అనే వ్యక్తి కుమారుడు తన్వీర్‌. ఇతను బాల్యం నుంచి అన్నం తినడం లేదు. ఎవరైనా బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించినా వాంతికి చేసుకునే వాడు. కేవలం చాయ్‌బన్, బజ్జి, రొట్టె వంటి  పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు

బాలుని అలవాటు తెలుసుకుని బంధువులెవరూ ఇతనికి అన్నం పెట్టేవారు కాదు. చాయ్‌బన్‌తో ఆతిథ్యం ఇచ్చేవారు. బాలుడు ఎదిగే కొద్ది తల్లిదండ్రులకు ఆందోళన పడసాగారు. పదేళ్ల ప్రాయంలో సైక్రియాటిస్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది. బలవంతంగా తినిపిస్తే వాంతికి చేసుకునేవాడు. ప్రస్తుతం బాలుడు పదోతరగతి పూర్తి చేసుకుని ఇంటర్‌లోకి వెళ్లాడు. ఇప్పటి వరకు అన్నం ముట్టలేదు. ఎలాగైనా అన్నం అలవాటు చేయాలని, లేని పక్షంలో బలహీనంగా అవుతాడని వైద్యులు పదేపదే హెచ్చరించారు. 

ఈ క్రమంలో తల్లిదండ్రులు, మేనత్త బాలుడిని ఎన్‌పేటలోని సైక్రియాటిస్టు వైద్యురాలు డాక్టర్‌ జీవన వద్దకు తీసుకెళ్లారు.  ఆ వైద్యురాలు కౌన్సిలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆతర్వాత కుటుంబ సమేతంగా సంతోష్‌నగర్‌లో ఉంటున్న బాలుని మేనత్త వద్దకు వెళ్లారు. మేనత్త బలవంతంగా అన్నం తినిపించింది. వాంతికి చేసుకుని కాసేపు ఇబ్బందిపడ్డాడు.

అయినా భయపడలేదు. తల్లిదండ్రులు కూడా తినిపించసాగారు. ఆతర్వాత అన్నాన్ని జీర్ణించుకోగలిగాడు. ఇక తన్వీర్‌ అన్నం తింటున్నాడనే సమాచారం బంధువులందరికి తెలిసింది. దీంతో నానమ్మ, పెద్దమ్మలు అందరు కలిసి బుధవారం అతనికి పూలమాల వేసి సత్కరించారు. తలో ముద్ద అన్నం తినిపిస్తూ అన్నప్రాశన లాంటి కార్యక్రమం నిర్వహించారు. 
 

Read latest Ap-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు