పారిశ్రామిక ప్రకాశం !

19 Oct, 2021 08:41 IST|Sakshi

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు

రామాయపట్నం, దొనకొండల్లో హబ్‌లు 

కరువు జిల్లా ప్రకాశం.. పారిశ్రామిక ప్రగతి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వ్యవసాయం, పశుపోషణ తప్ప పారిశ్రామిక జాడ లేని జిల్లా నుంచి ఉపాధి కోసం ఏటా వేలాది మంది వలస బాట పడుతుంటారు. వలస జీవితాలకు చెక్‌ పెట్టేందుకు ఏపీఐఐసీ ప్రత్యేక ఇండస్ట్రియల్‌ పార్కుల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.వేల కోట్ల అంచనాలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు 9 ఇండస్ట్రియల్‌ పార్కులు, 2 ఎంస్‌ఎంఈ పార్కులు నెలకొల్పనున్నారు. దీంతో వేలాది మంది ఉపాధికి భరోసా లభించనుంది.  

ఒంగోలు అర్బన్‌: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేలాది కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ నిరంతరం ముఖ్యమంత్రితో మాట్లాడుతూ కృషి చేస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.  ఏపీఐఐసీ ద్వారా 9 ఇండస్ట్రియల్‌ పార్కులు, 2 ఎంఎస్‌ఎంఈ పార్కులు నెలకొల్పేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు.

9 ఇండస్ట్రియల్‌ పార్కులు 1753.11 ఎకరాలు, బీపీ సెజ్‌లకు 262.87 ఎకరాలు, 2 ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)కు 99.27 ఎకరాల అంచనాలతో పనులు ప్రారంభించారు. వీటిలో వివిధ కేటగిరీలకు సంబంధించి 1097 యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో గ్రానైట్‌ కటింగ్, పాలిషింగ్, టింబర్‌ డిపోలు, సా మిల్, ఆటోమొబైల్, సిమెంట్‌ బ్రిక్స్, రైస్‌ మిల్లులు, డాల్‌ మిల్స్, బిల్డింగ్‌ ప్రోడక్టŠస్‌తో పాటు మరికొన్ని యూనిట్లు ఉన్నాయి. ఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు రూ.2962.38 కోట్ల అంచనాలతో 34,989 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నిరుద్యోగులుగా ఉన్న యువతకు వివిధ వృత్తులకు సంబంధించి నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి చూపేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

రామాయపట్నం చుట్టూ.. 
రామాయపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు ఏపీఐఐసీ ద్వారా హబ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 4 నుంచి 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటిలో ఇప్పటికే 2346.36 ఎకరాలు పట్టా భూమి, 554.92 ఎకరాల అసైన్డ్‌ భూమి, 879.19 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించి రూ.657.59 కోట్లతో భూ సేకరణ ప్రారంభించారు.  

దొనకొండలో.. 
జిల్లాలోని దొనకొండ ప్రాంతంలోని 21 గ్రామాల్లో 25,062.84 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానిలో ఇప్పటికే 2395.98 ఎకరాలు గుర్తించి సేకరిస్తున్నారు. దీనిలో భాగంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు దొనకొండ ప్రాంతంలో 43.79 ఎకరాలను అభివృద్ధి చేశారు. దొనకొండ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ కోసం కందుకూరు సబ్‌ కలెక్టర్‌ రూ.394.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  

నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌)ను 6366.66 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ అంచనాలు రూపొందించింది. దానిలో ఇప్పటికే ఆరు గ్రామాలకు సంబంధించి 1839.09 ఎకరాలకు కలెక్టర్‌ అడ్వాన్స్‌ పొజిషన్‌ ఏపీఐఐసీకి అందచేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మాలకొండపురంలో 1137.63 ఎకరాలకు 856.67 ఎకరాలు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇచ్చేందుకు కలెక్టర్‌ వద్దకు దస్త్రం చేరింది. 

జిల్లాలో ఇప్పటికే ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో 574 ప్లాట్లలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వాటిలో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్, ఒంగోలు బీపీ సెజ్, గిద్దలూరు, మార్కాపురం, సింగరాయకొండ ఇండస్ట్రియల్‌ పార్కులు, నాగరాజుపల్లి ఫుడ్‌పార్కు, ఎంఎస్‌ఎంఈ మాలకొండాపురం, రాగమక్కపల్లి, చీరాల ఆటోనగర్‌ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.  

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పాలు ప్రాంతాల్లో భూములను గుర్తించారు. వాటిలో కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని చినలాటరపి గ్రామంలో 53.33 ఎకరాలు, కొండపి నియోజకవర్గంలో చినకండ్లగుంటలో 33.41, పెదకండ్లగుంటలో 29.90 ఎకరాలు, కొత్తపట్నం మండలంలో 50 ఎకరాలు, మార్టూరు మండలంలో 74.18 ఎకరాల భూములను ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం అభివృద్ధి చేసేందుకు కలెక్టర్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు.

నిరుద్యోగానికి చెక్‌
వెనుకబడిన జిల్లా అభివృద్ధే ఏకైక అజెండాగా పనిచేస్తున్నాం. జిల్లాలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఏర్పడితే జిల్లాలో నిరుద్యోగంలో ఉన్న యువతకు ఉపాధి చూపవచ్చు. అంతేకాకుండా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుతో వలసలను అరికట్టవచ్చు. జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాం. పరిశ్రమలు ఒక ప్రాంతంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ మేరకు ఆచరణలో ప్రారంభించి ముందుకెళ్తున్నాం. ఔత్సాహికులైన యువత సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలి. 
-– కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ 

మరిన్ని వార్తలు