మహాత్ముడు మెచ్చిన జిల్లా.. ఏకంగా ఐదు సార్లు పర్యటన

8 Oct, 2021 15:46 IST|Sakshi

నెల్లూరు సిటీ: భారతదేశాన్ని ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కల్గించిన జాతిపిత మహాత్మాగాంధీకి నెల్లూరు జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లాలో మహాత్మాగాంధీ ఐదు సార్లు పర్యటించారు. 1915–1946 సంవత్సరాల మధ్యలో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు గాంధీ. నెల్లూరు నుంచి వెంకటగిరి వరకు, సంగం నుంచి అనంతసాగరం వరకు, కావలి నుంచి సూళ్ళూరుపేట వరకు అనేక గ్రామాల్లో పర్యటించారు. 1915వ సంవత్సరం మే 14వ తేదీన తొలిసారిగా మహాత్మాగాంధీ భార్య కస్తూర్బాగాంధీతో నెల్లూరుకు వచ్చారు. 

అప్పట్లో మద్రాసు రాష్ట్ర రాజకీయ మహాసభ నెల్లూరులో జరగడంతో ఆయన పాల్గొన్నారు. 1921 ఏప్రియల్‌ 7వ తేదీన ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో పెన్నానది తీరాన నిర్మించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని ప్రారంభించారు. అదే పర్యటనలో నెల్లూరులో తిలక్‌ విద్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు టౌన్‌హాల్‌లో జరిగిన మహిళా సమావేశంలో, వీఆర్‌ కళాశాల ఆవరణంలో మతసామరస్య సరస్సులో పాల్గొన్నారు. తల్పగిరి రంగనాధున్ని దర్శించుకున్నారు.

1929వ సంవత్సరంలో గాంధీజీ ఐదురోజులు పాటు జిల్లాలో ఉన్నారు. మే 10వ తేదీన బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన బహిరంగసభలో పాల్గొనడంతోపాటు యల్లాయపాళెం, రాజుపాళెం, గండవరం, పార్లపల్లి, విడవలూరు, మోపూరు, అల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో బుచ్చిరెడ్డిపాళెంలో ఖాదీ నిధికోసం రూ.7వేలు నగదు సేకరించారు. 11వ తేదీన కావలి, ఉలవపాడు, సిద్దనకొండూరు, చింతలపాళెం, పామూరు, కందుకూరు ప్రాంతాల్లో, 12వ తేదీన సంగం, మైపాడు, గంగపట్నం, ఇందుకూరుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో ప్రజలకు స్వాతంత్ర స్పూర్తిని నింపారు.

ఈ పర్యటనలోనే కస్తూరిదేవీ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. నాలుగోసారి 1933 డిసెంబర్‌ 30వ తేదీన జిల్లాకు వచ్చిన జాతిపిత బిట్రగుంట, కావలి, అల్లూరు, గండవరం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు, వెంకటగిరి, నాయుడపేట గ్రామాల్లో పర్యటించారు. ఐదవసారి 1946 జనవరి 21వ తేదీన బిట్రగుంట నుంచి మద్రాసు వరకు పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. లక్షలాది మంది ఆయన వెంట నడిచారు. జిల్లాలో జాతిపిత పర్యటనకు గుర్తుగా పత్తి సుబ్బారావు అనే వ్యక్తి నెల్లూరు నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు గాంధీబొమ్మ సెంటర్‌గా పిలుస్తున్నారు. 

Read latest Ap-special News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు