Gandhi Jayanti 2023: గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..

2 Oct, 2023 08:53 IST|Sakshi

మహాత్ముడి అవసరం పెరిగిందిగాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్‌  డై’ ఎందరినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్‌ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్‌ వారిని తరిమేశారు.

మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశ యాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవ లసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ.

గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందాలనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి.
– కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 

(చదవండి: తెలంగాణ పోరాట స్ఫూర్తి!)

మరిన్ని వార్తలు