ఆసరా వచ్చింది.. అప్పు తీర్చింది

29 Nov, 2023 05:55 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

కట్టెలమ్మిన చోటే పండ్లమ్ముతున్నా..
20 ఏళ్లుగా నాకున్న రెండెకరాల్లో నిమ్మతోటనే జీవనాధారంగా చేసు­కుని ఇద్దరు పిల్లలను చది­వించుకుంటున్నాను. గతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఎటుచూసినా తోట మొత్తం ఎండిపోయేది. సరిపడా నీరు లేక దిగుబడి చాలా తక్కువగా చేతికొచ్చేది. దీంతో నిమ్మకాయల మార్కెట్‌ యార్డులో వ్యాపారుల వద్ద అప్పులు చేసి, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించాల్సి వచ్చింది. అదే క్రమంలో ఎండిపోయిన తోటను పూర్తిగా నరికించి వంట చెరకుగా అమ్మేశాను. ఫలితంగా కుటుంబ పోషణే భారంగా మారింది. చుట్టూ అప్పులతో మునిగి­పో­యాను.

దిక్కుతోచని పరిస్థితుల్లో సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన జలయజ్ఞం నా తోట స్వరూ­పాన్నే మార్చేసింది. ఎస్‌పీఎస్‌­ఆర్‌ నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మా  గ్రామం పులికల్లు చెంతనే కండలేరు హై లెవల్‌ స్లూయిజ్‌ నుంచి ఎడమగట్టు కాలువను రూ.40 కోట్లతో తవ్వించారు. దీంతో మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. తర్వాత మళ్లీ నిమ్మ తోట పెంచాను. ప్రస్తుతం తోట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిమ్మతోట ఎండిందే లేదు. ఫలసాయం అందడంతో ఇబ్బందుల నుంచి బయటపడ్డాను.

చేసిన అప్పులన్నీ క్రమంగా తీర్చేశాను. ఇప్పుడు మళ్లీ ధైర్యంగా వ్యవసా­యం చేస్తున్నా. ఈ ప్రభుత్వం పుణ్యంతోనే ఉద్యాన పంటలను చక్కగా పండించుకుంటు­న్నాము. గత పాల­కులు మాటలతో మభ్యపెట్టి దశాబ్దాలుగా మా ప్రాంతంలో కాలువ పనులు చేపట్టకపోవడం వల్ల నా లాంటి రైతులు ఎంతో మంది తీవ్రంగా నష్టపో­యారు. ఈ ప్రభుత్వం పథకాల పుణ్య­మాని నా పిల్లల చదువులు పూర్తయ్యాయి.      – సన్నాల శ్రీనివాసులురెడ్డి, పులికల్లు    (కె.మధుసూదన్, విలేకరి, పొదలకూరు)

ఓ గూడు దొరికింది
నా భర్త ఊరూరూ తిరిగి బట్టల వ్యాపారం చేస్తారు. వచ్చిన ఆదాయం అంతంత మాత్రంగా సరిపోయేది. బతకడానికే ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే ఇల్లు కట్టుకునే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఆ ఊహకే స్వస్తి పలికాం. కాకినాడ జిల్లా సామర్లకోటలోని వీర్రాఘవపురంలో సుమారు 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. గతంలో అనేక పర్యాయాలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసినా ఏ ప్రభుత్వంలోనూ స్థలం రాలేదు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఒక రోజు వలంటీర్‌ మా ఇంటి వద్దకు వచ్చాడు. దరఖాస్తు పెట్టుకుంటే ఉచితంగా ఇంటి స్థలం ఇస్తారని చెప్పారు.

ఇదంతా చూసిందేలే అనుకున్నాము. మా వలంటీరే దరఖాస్తు నింపించి ప్రభుత్వానికి పంపించారు. కొద్ది రోజుల్లోనే వలంటీరే మా ఇంటికి వచ్చి సామర్లకోట ఈటీసీ లేఅవుట్‌లో స్థలం కేటాయించారని శుభ వార్త చెప్పారు. ఆ స్థలంలో చక్కగా మా ఆలోచనకు అనుగుణంగా ఇల్లు కట్టుకున్నాం.  ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలకు తోడు మరింత మొత్తం కలిపి అందంగా నిర్మించుకున్నాం. ఇదివరకు నెలకు రూ.5 వేలు అద్దెగా కట్టేవాళ్లం. ఇప్పుడు ఆ మొత్తం ఆదా అవుతోంది. పిల్లలకు అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాలు వస్తుండటంతో వారి చదువుకు ఇబ్బంది లేకుండా పోయింది. మా జీవితానికి ఈ ప్రభుత్వం ఒక కొత్త బాట వేసింది.     – కట్టా పద్మావతి, సామర్లకోట    (అడపా వెంకటరావు, విలేకరి, సామర్లకోట)

మా వ్యాపారానికి ‘ఆసరా’  

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం  మా­ది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. పెద్ద­మ్మాయికి పెళ్లి చేశాం. రెండో అమ్మాయి ఇక్కడే హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. మా ఆయన చేపలు పట్టి తెస్తే వాటిని ఇక్కడే అమ్మేవాళ్లం. సరుకు కొని బయటికి వెళ్లి వ్యాపా­రం చేయాలని ఉన్నా పెట్టుబడి లేక ఊరు­కున్నాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాకు అండగా నిలిచాయి. విజయ­నగరం జిల్లా లక్కవరపు­కోటలోని వీరభద్ర పొదుపు సంఘంలో ఉన్న నాకు మూడు విడతలుగా ఆసరా కింద రుణమాఫీ మొత్తం రూ.21,300 అందింది.

బ్యాంకు లింకేజీ కింద రూ.1,00,000, స్త్రీనిధి నుంచి రూ.50,000 మంజూరైంది. ఈ సొమ్ముతో చేపల వ్యాపారం ప్రారంభించాం. సరుకు కొనుగోలు చేసి మా ఆయనతో కలిసి అరకు, అనంతగిరి మండలాల్లో అమ్ముతు­న్నాం. కూతురి చదువుకు అమ్మఒడి సొమ్ము అందుతోంది. జగనన్న విద్యాకానుక రూపంలో ఆమె చదువుకు అవసరమైన సామగ్రి అంతా ప్రభుత్వమే అందిస్తోంది. ఇప్పుడు మా వ్యాపారం కూడా బాగుంది. ఈ ప్రభుత్వం వల్ల మా కుటుంబం గౌరవంగా బతికే అవకాశం కలిగింది.      – గుదేలక్ష్మి, నెయ్యిలవీధి, లక్కవరపుకోట (ఆర్‌.వి.సూర్యప్రతాప్, విలేకరి, శృంగవరపుకోట)

>
మరిన్ని వార్తలు