పాల ఉత్పత్తిలో ‘తడకనపల్లి’ పశువుల హాస్టల్‌కు రెండోస్థానం

20 Oct, 2021 22:30 IST|Sakshi

రెండు వందలకు పైగా గేదెలకు ఆశ్రయం

రోజుకు వెయ్యికి పైగా లీటర్ల పాల ఉత్పత్తి

పాల విక్రయం ద్వారా ఆదాయం పెంచుకుంటున్న మహిళలు

అనుబంధంగా.. అభివృద్ధి చెందుతున్న పాలకోవా పరిశ్రమ

వైఎస్‌ ప్రవేశపెట్టిన పాల ప్రగతి కేంద్రాలే హాస్టల్‌ ఆవిర్భావానికి మూలం

ప్రభుత్వానిది మంచి ఉద్దేశం

కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ కల్లూరు : కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని తడకనపల్లి గ్రామంలో పాలు ‘వెల్లువలా’ ఉత్పత్తి అవుతోంది. అక్కడ ప్రభుత్వ పశువుల సంక్షేమ వసతి గృహం ఉండటమే ఇందుకు కారణం. గ్రామ సమీపంలోని పదెకరాల సువిశాల స్థలంలో నెలకొల్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 1.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వపు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మరో రూ. 50 లక్షలు జోడించి సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు.

నాలుగేళ్ల క్రితం (2017, జనవరి 2వ తేదీన) 40 గేదెలతో ప్రారంభమైన ఈ హాస్టల్‌ నేడు ఆ సంఖ్య 200కు పెరిగింది. గేదెలను ఉంచడానికి సుమారు ఎకరం స్థలంలో నాలుగు షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లు సుమారు 300 గేదెల పెంపకానికి కూడా  సరిపడతాయి.  గేదెల మేత కోసం తొమ్మిది ఎకరాల్లో సూపర్‌ నేపియర్, ఏబీబీఎన్‌ రకాల గడ్డిని పెంచారు. ఆయా రకాల గడ్డిని మేత మేయడం వల్ల గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి. ఇలాంటి హాస్టల్‌ రాష్ట్రంలో ఇదే మొదటిదని, దేశంలో గుజరాత్‌ తర్వాతి స్థానం దీనికే లభిస్తుందని పశు సంవర్ధక శాఖ జేడీ రమేశ్‌బాబు వివరించారు. హాస్టల్‌ పుట్టుపూర్వోత్తరాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది..

వైఎస్‌ ప్రవేశపెట్టిన పీపీసీలే ఆవిర్భావానికి కారణం..
తడకనపల్లి గ్రామ పంచాయతీలో 4,300 జనాభా ఉంది. 1,050 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పొదుపు లక్ష్మి గ్రూపులు 92 ఉన్నాయి. వాటిలో సభ్యులు దాదాపుగా ప్రతి కుటుంబానికి ఒకరుంటారు. ఇక్కడి మహిళలు చైతన్యవంతులు. ఆర్థిక స్వావలంబన అభిలాష బలంగా ఉంది. గేదెల పెంపకం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించి ఎక్కువ సంఖ్యలో అదే వృత్తిని అవలంబించారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో పాల ప్రగతి కేంద్రాలు (పీపీకేలు) ప్రవేశపెట్టారు.

ఈ పథకాన్ని ఆతర్వాత వచ్చిన  ముఖ్యమంత్రులు సెర్ప్‌ ద్వారా అమలు చేశారు.  ఐదుగురు డ్వాక్రా గ్రూపు మహిళలు ఒక యూనిట్‌గా జాయింట్‌ లయబుల్‌ గ్రూప్‌ (జేఎల్‌సీ)లను 2013లో ఏర్పాటు చేశారు. ఒక్కో జేఎల్‌సీకి ఇతర రాష్ట్రాల నుంచి  తెప్పించిన ముర్రా జాతి గేదెలను బ్యాంకు రుణం ద్వారా కొనిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ. లక్ష సబ్సిడీ ఇచ్చారు. గేదెలు కొనడానికి ముందే గడ్డి పెంపకానికి రూ. 30 వేల రుణాన్ని అడ్వాన్స్‌గా ఇప్పించారు. జిల్లా మొత్తంగా 60 పాల ప్రగతి కేంద్రాలు మంజూరైతే కేవలం తడకనపల్లి గ్రామానికి 12 పీపీకేలు కేటాయించారు. ఆ సమయంలో ఇక్కడ గేదెల పెంపకం, పాల ఉత్పత్తి తారాస్థాయికి చేరుకుంది.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 2014లో అప్పటి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ మహిళలు గేదెల పెంపకంపై చూపిస్తున్న ఆసక్తిని గుర్తించి పశువుల హాస్టల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి చిన్నటేకూరు పశువైద్యుడు డాక్టర్‌ నాగరాజు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  అప్పటి పశువైద్య శాఖ జేడీ వేణుగోపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ను ఆశ్రయించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షలు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. 

హాస్టల్‌ ఆవిర్భావానికి ముందు..
ఇంట్లో స్థలం లేని మహిళలు గేదెలను ఇంటి ముందు ఓ తడికె కింద కట్టేసేవారు. దానివల్ల వర్షానికి తడిసి, ఎండకు ఎండి గేదెల పెంపకానికి సరైన అనుకూల వాతావరణం లభించేది కాదు. రాత్రివేళ రక్షణ ఉండేది కాదు. ప్రభుత్వం పశువుల సంక్షేమ వసతి గృహం చేసిన తర్వాత సరైన సదుపాయాలు కలిగాయి. ఈ కారణంగా మొదట 40 గేదెలతో ప్రారంభమైన పశువుల హాస్టల్‌ క్రమేపీ అభివృద్ధి చెంది ప్రస్తుతం 200 గేదెలతో కళకళలాడుతోంది.

హాస్టల్‌ నిర్వహణ ఇలా...
ఈ హాస్టల్‌లో ప్రస్తుతం సుమారు నలభై నుంచి యాభై కుటుంబాల మహిళలు తమ గేదెలకు ఆశ్రయం కల్పించారు. ఎవరి గేదెలను వారు శుభ్రం చేసి, మేత వేసుకుని వెళ్లాలి. పాలు పిండుకోవాలి. హాస్టల్‌కు అవసరమైన నీటి వసతిని తడకనపల్లి చెరువు నుంచి కల్పించారు. చెరువులో బోరు వేసి పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికయ్యే కరెంటు బిల్లును పెంపకందారులంతా సమానంగా భరించాలి. హాస్టల్‌ మైదానంలో గడ్డి పెంచాలనుకుంటే సొంత ఖర్చుతోనే పెంచుకోవచ్చు.

ప్రత్యేక నిర్వహణ కమిటీ..
పశువుల హాస్టల్‌కు ప్రత్యేక నిర్వహణ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ హాస్టల్‌ ప్రారంభంతోనే ఆవిర్భవించింది. ఈ కమిటీకి ప్రస్తుతం బొజ్జమ్మ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జుబేదాబీ, అంజనమ్మ, గంగావతి, హుసేన్‌బీ, శేషమ్మ కమిటీ సభ్యులు. నెలకొకసారి సమావేశమై నిర్వహణ ఖర్చులపై చర్చిస్తారు. ఒక్కో గేదెపై నెలకు రూ. 100 చొప్పున ఫీజు వసూలు చేస్తారు.

పెంపకం కూలీలుగా బీహార్‌వాసులు..
గేదెల పోషణలో బీహార్‌వాసులు నిష్ణాతులు. హాస్టల్‌లో ఎక్కువ సంఖ్యలో గేదెలు పెట్టుకున్న  పెంపకందారుల (గేదెల యజమానుల)కు పోషణ సాధ్యం కాకపోవడంతో అలాంటి వారు తమ సొంత ఖర్చుతో బీహార్‌వాసులను కూలీలుగా నియమించుకున్నారు. గేదెకి రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తే పాలు పిండే పని మొదలు సపరలన్నీ వారే చేస్తారు.

అధిక పాలదిగుబడి...
హాస్టల్‌లో పోషిస్తున్న గేదెలు దాదాపుగా హర్యానాకు చెందిన ముర్రా జాతి, తమిళనాడుకు చెందిన గ్రేడెడ్‌ ముర్రాజాతి రకాలకు చెందినవి. వీటికి పాల దిగుబడి ఎక్కువ. పైగా హాస్టల్‌లో గేదెలకు సరైన గాలి, వెలుతురు, మంచి వాతావరణం ఉంటుంది. దీనికి తోడు సూపర్‌ నేపియర్, ఏబీబీఎన్‌ రకాల గడ్డి వాడుతుండటం వల్ల ఒక్కో గేదె రోజుకు 18 మొదలు 20 లీటర్ల దాకా పాలిస్తుంది. పాల కొనుగోలుదారులు ఇక్కడికే వచ్చి లీటరు రూ.50కి చొప్పున కొనుగోలు చేసుకువెళతారు. గ్రామంలో కాకుండా కేవలం పశువుల హాస్టల్‌లోనే రోజుకు వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. గేదెలు పోషించే మహిళలు లక్షాధికారులయ్యారు. 

ఉన్న చోటికే వైద్యం..
గతంలో ఇళ్ల వద్ద పోషణ చేసే సమయంలో పెంపకందారులు పశువును ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే వ్యయ, ప్రయాసలకు లోనయ్యేవారు. హాస్టల్‌లో అలాంటి ఇబ్బంది ఉండదు. పశువైద్యులే ఇక్కడికి వస్తారు. ఓ వెటర్నరీ అసిస్టెంట్‌ నిత్యం ఇక్కడే విధులు నిర్వర్తిస్తుంటారు. వారానికి ఒకసారి చిన్నటేకూరు పశువైద్యుడు పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వాటికి వైద్యం చేస్తారు.

అనుబంధంగా పాలకోవా పరిశ్రమ...
తడకనపల్లిలో పాల ఉత్పత్తి అధికంగా జరుగుతుండటం వల్ల ఇక్కడ పాలకోవా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కుటీర పరిశ్రమలా ప్రతి ఇంట్లో బట్టీలు పెట్టి కోవాను తయారు చేస్తున్నారు. ఎక్కువ ఆర్డర్లు వచ్చే కొందరు మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి యంత్రాల  సాయంతో కోవా తయారు చేస్తున్నారు. తడకనపల్లి కోవా అనేది బ్రాండెడ్‌గా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అంతే కాకుండా కోవాను విక్రయించే ప్రత్యేక స్టాల్స్‌ వెలిశాయి. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట వెళితే వరుసగా కనిపిస్తాయి.

ఫలించిన స్థానిక ఎమ్మెల్యే కృషి...
హాస్టల్‌ విద్యుత్తు బిల్లు గతంలో కమర్షియల్‌ కేటగిరీలో ఉండేది. దీనివల్ల యూనిట్‌ కాస్ట్‌ పెరిగి, బిల్లు కూడా పెద్ద మొత్తంలో వచ్చేది. కరెంటు బిల్లు ఖర్చును కూడా పెంపకందారులంతా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మోయలేని భారంగా ఉండేది. విషయం స్థానిక శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి  దృష్టికి వెళ్లింది. ఆయన చొరవ తీసుకుని ‘డైరీ ఫాం’ కేటగిరీకి మార్చాలంటూ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈతో మాట్లాడారు. అందుకు ఎస్‌ఈ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. డైరీ ఫాం కేటగిరీ వల్ల తమకు బిల్లు భారం తగ్గనుందని పెంపకందారులు సంతోష పడుతున్నారు.

నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు వస్తుంది: శేషమ్మ, గేదెల పెంపకందారు
తడకనపల్లిలో ఉంటాను. జిలానీ గ్రూప్‌ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని. ఏడు బర్రెలను హాస్టల్‌లో పెట్టాను. వీటికి మేత పెట్టడం, పేడ తీయడం, స్నానం చేయించడం, పాలు పితకడం వంటి అన్ని సపర్యలు మేమే చేసుకుంటాం. మా బర్రెలు ఉదయం 20, సాయంత్రం 12 చొప్పున రోజుకు 32 లీటర్ల పాలు ఇస్తాయి. పాల వ్యాపారి నుంచి నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు లభిస్తుంది.

పశువుల హాస్టల్‌.. ఓ మంచి ఉద్దేశం: రమేశ్‌బాబు, పశుసంవర్ధక శాఖ జేడీ
ప్రభుత్వం తడకనపల్లిలో పశువుల హాస్టల్‌ ఏర్పాటు చేయడం ఒక మంచి ఉద్దేశం. మహిళలు చిన్నచిన్న ఇళ్లల్లో గేదెలను కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. స్థలం లేక ఇంటి బయట షెడ్డు వేసి ఉంచుతున్నారు. అలాంటి వాతావరణంలో పశువుల ఆరోగ్యానికి రక్షణ ఉండదు. పాల ఉత్పత్తి కూడా వాటి స్వస్థతను బట్టి ఉంటుంది. ఇక్కడ పశువుల హాస్టల్‌ ఏర్పాటు చేయడం వల్ల గ్రామం పాల ఉత్పత్తి కేంద్రంగా మారింది. పశువైద్యం కూడా ఒకేచోట లభిస్తోంది. చిన్నటేకూరు పశువైద్యుని పర్యవేక్షణ ఉంటుంది.

మరిన్ని వార్తలు