పార్టీ చరిత్ర తెలుసుకుని ఓటెయ్యాలి | Sakshi
Sakshi News home page

పార్టీ చరిత్ర తెలుసుకుని ఓటెయ్యాలి

Published Tue, Nov 14 2023 1:56 AM

దమ్మపేట మండలం మల్లారం సభలో 
మాట్లాడుతున్న కేసీఆర్‌, పక్కన మెచ్చా   - Sakshi

అశ్వారావుపేట : ఎన్నికల్లో ఎంతో మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, వారి వెనుక ఉన్న పార్టీల చరిత్ర తెలుసుకుని ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌ ప్రజలను కోరారు. దమ్మపేట మండలం మల్లారంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. పరిణతి చెందిన దేశాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని, మనం ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. మంచివాళ్లను ఎన్నుకుంటే అది అభ్యర్థి గెలుపు కాదని, ప్రజలే గెలిచినట్టని, తద్వారా పాలనలో సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. గతంలో హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రలో కలిపారని, ఆ ఘనత కాంగ్రెస్‌ నాయకులేదనని విమర్శించారు. 1969 ఉద్యమంలోనూ 400 మందిని కాల్చి చంపారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా వలసలు వెళ్లేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రంలోనూ ఇలా లేదని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి సెంటు భూమినీ సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.

పోడు కేసులు ఎత్తేశాం..

అశ్వారావుపేట నియోజకవర్గంలో 26 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చి రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని, పోడు కేసులను ఎత్తేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, 100 పడకల ఆస్పత్రి, డయాలసిస్‌ సెంటర్‌, మరో పామాయిల్‌ ఫ్యాక్టరీ కూడా వచ్చాయని తెలిపారు. సౌమ్యుడు, వివాద రహితుడైన మెచ్చా నాగేశ్వరావును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement