Tesla Model 3: భద్రతలో రాజీ లేదు.. ఎలన్‌ మస్క్‌ చెప్పిన దాని కంటే మిన్నగా..

17 Dec, 2021 19:36 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్ల ప్రపంచంలో టెస్లా ఒక నూతన అధ్యాయం మొదలు పెట్టింది. ఎలన్‌మస్క్‌ నేతృత్వంలో వచ్చిన కార్లు అనతి కాలంలోనే యూజర్ల మనసులు దోచుకోవడంతో ఈ కంపెనీకి తిరుగే లేకుండా పోయింది. ఒకప్పుడు ఎలక్ట్రిక్‌ కార్లు మార్కెట్‌లో సక్సెస్‌ కావన్న కంపెనీలే ఇప్పుడు అదే రూట్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

టెస్లా నుంచి ఇప్పటికే అనేక సక్సెస్‌ఫుల్‌ మోడల్స్‌ మార్కెట్‌లో ఉండగా లేటెస్ట్‌ కారుగా మోడల్‌ ఎస్‌ ప్లెయిడ్‌ని ఎలన్‌మస్క్‌ ఇటీవల మార్కెట్‌లో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఈ మోడల్‌ గురించి ఎలన్‌మస్క్‌ మాట్లాడుతూ... ఈ కారు వేగంలో పోర్షేను సేఫ్టీలో వోల్వోను మించిన కారంటూ చెప్పారు. ఆయన ఎందుకు అలా అన్నారో కానీ ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఘటన మాత్రం టెస్లా కార్లు ఎంత సేఫ్టీ అనే విషయాన్ని అన్యాపదేశంగా చెబుతున్నాయి.

ఇటీవల అమెరికాను టోర్నోడోలు ముంచెత్తాయి. వేగంగా వీచిన గాలుల దాటికి పెద్ద చెట్లు కూకటి వేళ్లతో కూలిపోయాయి. భారీ గోడౌన్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఈ టోర్నోడో విశ్వరూపం ప్రదర్శిస్తున్న సమయంలోనే ఒంటారియాలో వేగంగా వెళ్తున్న ఓ టెస్లా మోడల్‌ 3 కారుపై భారీ చెట్టు కూలి పోయింది. సుమారు 2000 పౌండ్లు ( 907 కేజీలు) బరువు ఉన్న ఆ చెట్టు ఒక్క సారిగా మీద పడటంతో ఈ కారు తుక్కుతుక్కు అవుతుందని అనుకున్నారు. 

టెస్లా సంస్థ తమ కార్ల బిల్ట్‌ క్వాలిటీలో కాంప్రమైజ్‌ కాకపోవడం వల్ల భారీ చెట్టు మీద పడినా కొద్ది సొట్టు పోవడం, కొంచెం అద్దం పగిలిపోవడం మినహా పెద్దగా డ్యామేజీ ఏమీ జరగలేదు. కారులో ప్రయాణిస్తున​ వ్యక్తులు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఇటీవల ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. ఈ వీడియో చూసిన వారు టెస్లా కార్ల నాణ్యతను ప్రశంసిస్తున్నారు. 

చదవండి : టెస్లాకు గట్టి పోటీ.. ఛార్జింగ్ లేకున్నా 50 కిమీ దూసుకెళ్తుంది!

మరిన్ని వార్తలు