సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్‌ఏఐకి ఎదురు దెబ్బ!

21 Nov, 2023 11:47 IST|Sakshi

శామ్‌ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఓపెన్‌ఏఐలోని ఉద్యోగులు తిరగబడ్డారు. ఉన్న 730 మంది ఉద్యోగుల్లో 500 మంది రాజీనామా చేస్తామంటూ బోర్డ్‌ను బెదిరించారు. ఈ మేరకు వారు ఓ లేఖ రాశారు. ఓపెన్‌ ఏఐ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ సుముఖంగా ఉందని, ఇదే విషయంపై హామీ ఇచ్చినట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. శామ్‌ ఆల్ట్‌మన్‌ని మళ్లీ సంస్థలోకి చేర్చుకుంటే రాజీనామాలపై పునరాలోచన చేస్తామని ఉద్యోగులు ఆ లేఖలో స్పష్టం చేశారు.  

‘‘ఓపెన్‌ ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం మీకు లేదని మీ చర్యల ద్వారా స్పష్టం అవుతుంది. మా లక్ష్యం, ఉద్యోగుల పట్ల యోగ్యత, సంస్థ పట్ల నిబద్ధత లేని వారి కోసం మేం పని చేయలేకపోతున్నాం.‘అందుకే, ప్రస్తుత బోర్డ్ సభ్యులందరూ రాజీనామా చేయాలి. లేదంటే మేం వెంటనే ఓపెన్‌ఏఐకి రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్‌ ఏఐ విభాగంలో చేరిపోతాం. బ్రెట్ టేలర్, విల్ హర్డ్ వంటి ఇద్దరు కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్లను బోర్డు నియమించి, సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మాన్‌లను తిరిగి నియమిస్తే అప్పుడు ఆలోచిస్తామని’ అని లేఖలో తెలిపారు.  

ఇక్కడ విచిత్రం ఏంటంటే? 
ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆల్ట్‌మన్‌ను తొలగించేలా బోర్డ్‌ ప్రయత్నాలకు ఓపెన్‌ఏఐ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్‌కేవర్ నాయకత్వం వహించారు. ఇప్పుడు అదే సట్స్‌కేవర్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ సంస్థ నుంచి తొలగించడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. బోర్డ్‌ ప్రయత్నాల్లో తన పాత్ర ఉండడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.  

శామ్‌ ఆల్ట్‌మన్‌ను ఎందుకు తొలగించింది
శామ్‌ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్‌ఏఐ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఆల్ట్‌మన్‌ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ తన పదవికి రాజీనామా చేశారు. 

చదవండి👉‘AI’ వల్ల ఉద్యోగాలు పోవడం ఖాయం.. చాట్‌జీపీటీ సృష్టి కర్త సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు