సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

21 Nov, 2023 09:58 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 301 పాయింట్లు లేదా 0.46% పుంజుకుని 65,952 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు లేదా 0.45% లాభపడి 19,786 వద్దకు చేరింది. భారతదేశం 4 ట్రిలియన్‌ల జీడీపీ మార్కును అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా మార్కెట్లు మరింత పుంజుకుని అభివృద్ధి దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఫెడ్‌ మినట్స్‌ మీటింగ్‌ ప్రధాన అంశాలు త్వరలో విడుదలవనున్నాయి. దాంతో సోమవారం యూఎస్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 146 పాయింట్లు లాభంతో 43,736 వద్ద, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 138 పాయింట్లు లాభపడి 41,990 వద్దకు చేరాయి. 

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.33 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, ఐటీసీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు పుంజుకున్నాయి.

ఓపెన్‌ఏఐ మాజీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌లో చేరనున్నారని ప్రకటన వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో కంపెనీ షేర్లు రెండు శాతానికి పైగా పెరిగి 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. ఐరోపా మార్కెట్లు సైతం సోమవారం లాభపడ్డాయి. ఆసియా పసిఫిక్‌ సూచీలూ నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.645 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.77 కోట్లు విలువ చేసే స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు