అందుబాటులో ఉచిత న్యాయ సేవలు.. సద్వినియోగ పరుచుకోండి

10 Nov, 2023 10:36 IST|Sakshi

గద్వాల క్రైం: ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సేవలను అందించాలనే లక్ష్యంతో లీగల్‌ సర్వీస్‌ అథారిటీస్‌ యాక్ట్‌ అమల్లోకి వచ్చిందని జిల్లా జడ్జి కుషా అన్నారు. గురువారం లీగల్‌ సర్వీస్‌ డే సందర్భంగా కోర్టు ఆవరణలో జాతీయ లీగల్‌ సర్వీస్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకునే క్రమంలో లాయర్లకు ఫీజులు చెల్లించలేని వారికి లీగల్‌ సర్వీస్‌ చేయూత అందిస్తుందన్నారు.

ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, మహిళలు, పిల్లలు, లైంగిక దాడులు, కిడ్నాప్‌, వరకట్న వేధింపులు, మానసిక – శారీరక హింస మొదలైన వాటి నుంచి న్యాయం పొందడానికి లీగల్‌ సర్వీస్‌ సెల్‌ను ఆశ్రయించవచన్నారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారని, ఈ క్రమంలో పాఠశాల, కళాశాల యాజమాన్యులతో లీగల్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాలు సైతం చేపట్టామన్నారు.

చట్ట పరిధిలోని ప్రతి సమస్యలకు ఉచితంగా న్యాయం అందించడమే లీగల్‌ సర్వీస్‌ డే ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జడ్జిలు కవిత, ఉదయ్‌నాయక్‌ కోర్టు సిబ్బంది, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఉన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం
అలంపూర్‌:
అట్టడుగు, వెనకబడిన పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే నేష్నల్‌ లీగల్‌ సర్వీస్‌ అధారిటీ లక్ష్యమని, ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జీ కమలాపురం కవిత అన్నారు. అలంపూర్‌లో నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ డే గురువారం నిర్వహించారు.ఈ సమావేశానికి జడ్జీ కమలాపురం కవిత ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

ప్రతి ఏడాది నవంబర్‌ 9వ తేదిన నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీతో వెనకబడిన పేద, అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయం, న్యాయ సేవలను అందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సమానత్వం, సామాజిక న్యాయం ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందన్నారు. కొందరికి న్యాయం ప్రత్యేక హక్కుగా కాకుండా అందరికి సమానమైన హక్కుగా వర్తిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ నరసింహులు, న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్‌ కుమార్‌, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, కిషన్‌ రావు, సాయితేజ ఉన్నారు.

మరిన్ని వార్తలు