విక్రయాలకు టెక్నాలజీ దన్ను

23 Jun, 2022 01:36 IST|Sakshi

అమ్మకాల ప్రక్రియలో సాంకేతికతపై ఆధారపడుతున్న కంపెనీలు

లింక్డ్‌ఇన్‌ సర్వేలో వెల్లడి

ముంబై: కోవిడ్‌–19 మహమ్మారితో వ్యాపారాలు అస్తవ్యస్తం అయిన నేపథ్యంలో మళ్లీ పుంజుకోవడానికి కంపెనీలు సాంకేతికతపై ఆధారపడుతున్నాయి. విక్రయాలను పెంచుకునేందుకు రియల్‌ టైమ్‌ డేటా కోసం 73 శాతం సంస్థలు  వారానికి కనీసం ఒకసారైనా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. డేటా ద్వారా కొనుగోలుదారుల అభిప్రాయాల గురించి మరింతగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

లింక్డ్‌ఇన్‌ ఆరో విడత సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సేల్స్‌ విభాగంలో సరైన డేటా పాత్ర కీలకంగా మారింది. దీంతో సీఆర్‌ఎం (కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌) సిస్టమ్‌లు, సేల్స్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాల వైపు విక్రేతలు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా యువ ప్రొఫెషనల్స్‌ (35 ఏళ్ల లోపు వారు) ఇలాంటి టెక్నాలజీల వినియోగానికి సారథ్యం వహిస్తున్నారు. 35 ఏళ్లు పైబడిన ప్రొఫెషనల్స్‌తో పోలిస్తే వారు 1.2 రెట్లు ఎక్కువగా సీఆర్‌ఎం సాధనాలను వారానికి మూడు గంటల పాటు ఉపయోగిస్తున్నారు.

డేటాతో సవాళ్లు ..
టెక్నాలజీవైపు మళ్లుతున్నప్పటికీ అసంపూర్తిగా, కచ్చితత్వం లేని డేటాను గుర్తించడం సవాలుగా ఉంటోందని ప్రతి 5 మంది విక్రేతల్లో ఇద్దరు (46 శాతం) వెల్లడించారు. ‘గడిచిన రెండేళ్లలో ఇంటి నుంచి పని విధానాలతో వివిధ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెరిగింది. మా డేటా ప్రకారం దేశీయంగా మూడొంతుల మంది విక్రేతలు ప్రస్తుతం వారానికి కనీసం ఒకసారైనా సేల్స్‌ టెక్నాలజీపై ఆధారపడుతున్నారు.

అంటే భవిష్యత్‌లో అమ్మకాలకు డేటానే చోదకంగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది‘ అని లింక్డ్‌ఇన్‌ సేల్స్‌ సొల్యూషన్స్‌ భారత విభాగం హెడ్‌ అభయ్‌ సింగ్‌ తెలిపారు. సేల్స్‌ బృందాలకు కచ్చితత్వంతో కూడుకున్న రియల్‌ టైమ్‌ డేటాను ఇవ్వడం ద్వారా కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, మెరుగైన అనుభూతి కల్పించేందుకు విక్రేతలకి టెక్నాలజీ ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. 

అంతర్జాతీయంగా అమ్మకాల పరిస్థితుల గురించిన నివేదికకు సంబంధించి భారత్‌ సహా ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా తదితర 11 దేశాల్లోని 15,000 మంది పైచిలుకు కొనుగోలుదారులు, విక్రేతలపై లింక్డ్‌ఇన్‌ ఈ సర్వే చేసింది. ఇందులో భాగంగా భారత్‌ ఎడిషన్‌ను కూడా రూపొందించింది. దీనికోసం భారత్‌లో 750 మంది కొనుగోలుదారులు, 750 మంది విక్రేతల అభిప్రాయాలు సేకరించింది. దీని ప్రకారం భారత్‌లో ప్రతి అయిదుగురిలో నలుగురు (81 శాతం) కొనుగోలుదారులు రిమోట్‌ పని విధానాల వల్ల కొనుగోళ్లు సులభతరంగా మారాయని తెలిపారు. విక్రేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు