డిజిటల్‌ పేమెంట్స్‌ బాటలో చిన్న సంస్థలు

14 Jun, 2022 05:49 IST|Sakshi

అత్యధికంగా 76 శాతం హైదరాబాద్‌ ఎంఎస్‌ఎంఈలే

నియోగ్రోత్‌ నివేదిక

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 కష్టాల నుంచి క్రమంగా బైటపడుతున్న చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) ఎక్కువగా డిజిటల్‌ పేమెంట్‌ విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాదీ సంస్థలు మరింత ముందున్నాయి. 76 శాతం సంస్థలు వీటిని వినియోగించుకుంటున్నాయి. దేశంలోనే ఇది అత్యధికం. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలిచ్చే ఫిన్‌టెక్‌ సంస్థ నియోగ్రోత్‌ విడుదల చేసిన ఎంఎస్‌ఎంఈ ఇన్‌సైట్‌ రిపోర్ట్‌ 2022 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

2020 మార్చి–2022 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 88 పరిశ్రమల వ్యాప్తంగా 40,000 పైచిలుకు ఎంఎస్‌ఎంఈలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా  నియోగ్రోత్‌ ఈ నివేదిక రూపొందించింది. మహమ్మారి విజృంభించిన సమయంలో ఎంఎస్‌ఎంఈలకు డిమాండ్‌పరంగా ఎదురైన పరిస్థితులు, రికవరీపై సహాయక చర్యల ప్రభావం, వ్యాపార నిర్వహణ కోసం డిజిటల్‌ వైపు మళ్లడం, రెండేళ్లుగా నిలదొక్కుకునేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను ఇందులో పరిగణనలోకి తీసుకుంది.

‘డిమాండ్‌ పడిపోయి, రుణాల చెల్లింపు భారం పెరిగిపోవడంతో 2020–21లో చాలా మటుకు ఎంఎస్‌ఎంఈలు చాలా సతమతమయ్యాయి. వ్యాపారం నిజంగానే దెబ్బతినడం వల్లే చాలా మటుకు సంస్థలకు అదనపు సహాయం అవసరమైందని కరోనా తొలినాళ్లలో మేము గుర్తించాము. సాధారణంగా ఎంఎస్‌ఎంఈ కస్టమర్లు నిజాయితీగానే ఉంటారు. రుణాలు తిరిగి చెల్లించే యోచనలోనే ఉంటారు. అందుకే వారికి అవసరమైన తోడ్పాటును మా వంతుగా మేము కూడా అందించాము‘ అని నియోగ్రోత్‌ సీఈవో అరుణ్‌ నయ్యర్‌ తెలిపారు.  

నివేదికలో మరిన్ని అంశాలు ..
► కోవిడ్‌–19 కష్టాల నుంచి గట్టెక్కడానికి దేశీయంగా 46 శాతం ఎంఎస్‌ఎంఈలకు ఆర్థికంగా సహాయం అవసరమైంది.  
► కోవిడ్‌–19 రెండో వేవ్‌ వచ్చేనాటికి ఎంఎస్‌ఎంఈలు కాస్త సంసిద్ధంగా ఉన్నాయి. దీంతో ఒకటో వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో 30 శాతం సంస్థలు మాత్రమే ఆర్థిక సహాయం తీసుకున్నాయి.  
► మెట్రోయేతర నగరాల్లో ఎంఎస్‌ఎంఈల రుణాలకు డిమాండ్‌ ఈ ఏడాది మార్చిలో తిరిగి కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకుంది. మెట్రో నగరాలు స్వల్పంగా వెనుకబడ్డాయి. బెంగళూరు, చెన్నైలో ఎంఎస్‌ఎంఈల రుణాలకు డిమాండ్‌ .. కోవిడ్‌ పూర్వ స్థాయిని మించింది.  
► పెట్రోల్‌ బంకులు, ఇన్‌ఫ్రా, ఆటోమొబైల్‌ వంటి విభాగాలు మిగతా రంగాలతో పోలిస్తే వేగంగా కోలుకున్నాయి.  
► గడిచిన రెండేళ్లలో ఎంఎస్‌ఎంఈలకు కొత్త అవ కాశాలు అందుబాటులోకి వచ్చాయి. రుణాలు పొందేందుకు, వ్యాపారాలను నిర్వహించుకునేందుకు పాటిస్తున్న సంప్రదాయ విధానాల స్థానంలో కొత్త తరం డిజిటల్‌ విధానాలు వచ్చేశాయి. చిన్న సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంలో డిజిటల్‌ రుణాలకు ప్రాధాన్యం పెరిగింది.

మరిన్ని వార్తలు