పెట్రోలు ధరలు.. రష్యా డిస్కౌంట్లు పరిశీలిస్తున్నాం - కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌

14 Mar, 2022 22:08 IST|Sakshi

కరోనా మహమ్మారి కాలంలో చాలా దేశాలలో ఇంధన ధరలు 50 శాతానికి పైగా పెరిగితే భారతదేశంలో కేవలం ధరలు 5 శాతం పెరిగాయని సభకు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ నేడు రాజ్యసభలో తెలిపారు. గత ఏడాది నవంబర్ 4న ఇంధన ధరలపై కేంద్రం పన్నులు తగ్గిస్తే మహారాష్ట్ర, కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదని అని అన్నారు. "మేము గత ఏడాది సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాము. కానీ, మహారాష్ట్ర & కేరళతో సహా తొమ్మిది రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదు. చమరు ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము" మంత్రి తెలిపారు. 

"కరోనా మహమ్మారి సమయంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యుకె, స్పెయిన్ దేశాలలో పెట్రోల్ ధరలు 50, 55 & 58 శాతం పెరిగితే.. భారతదేశంలో చమరు ధరలు 5 శాతం మాత్రమే పెరిగాయి. ఇందుకు మనం సంతోషించాలి" అని అన్నారు. ముడి చమురుపై రష్యా అందిస్తున్న డిస్కౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

గత మూడు సంవత్సరాలు, ప్రస్తుత సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం(సెస్లతో సహా) విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం వివరాలను మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. 2018-29లో సేకరించిన మొత్తం సుంకం రూ.2.14 లక్షల కోట్లు అయితే, 2019-20లో ఇది రూ.2.23 లక్షల కోట్లుగా ఉంది. ఇక 2020-21లో ఈ మొత్తం రూ.3.73 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి సేకరించిన మొత్తం సుంకం రూ.1.71 లక్షల కోట్లు వసూలు అయినట్లు హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.

(చదవండి: రష్యాతో బిజినెస్‌ చేస్తాం.. లాభం ఉక్రెయిన్‌కు ఇస్తాం!)

మరిన్ని వార్తలు