ఇజ్రాయెల్-పాలస్తీనా వార్‌: పెట్రోలు, నిత్యావసరాల ధరల వాత తప్పదా? 

16 Oct, 2023 18:01 IST|Sakshi

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం  దేశీయంగా ప్రజలపై పెనుభారం పడనుందా? పెట్రోలు సహా, పలు వినియోగ వస్తువులు,  ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే  అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం ప్రపంచ ముడి చమురు సరఫరాను ప్రభావితం చేయనుంది. దీంతో పాటు వివిధ వినియోగ ఉత్పత్తులు ఇతర మరెన్నో ప్రపంచ సరఫరాలకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రభావ తీవ్రతను కచ్చితంగా అంచనా లేనప్పటికీ ధరల పెరుగుదల తప్పదనేది నిపుణుల మాట. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ గోధుమ సరఫరాపై ప్రభావం చూపినట్లే, ఇజ్రాయెల్-హమాస్ వార్‌ ప్రపంచ ముడి చమురు సరఫరాకు ముప్పు తెస్తుందని, తద్వారా దేశంలో హైదరాబాద్ లాంటి ఇతర ప్రధాన నగరాల్లోని ప్రజల గృహవినియోగం భారం పడుతుందని  ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 7.5 శాతానికి పైగా పెరిగింది.ఇప్పటికే బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. 

ఎన్‌సిఆర్‌కు చెందిన వైట్ గూడ్స్ తయారీదారు సూపర్‌ప్లాట్రానిక్స్  సీఈవో అవనీత్ సింగ్ మార్వా ప్రకారం, యుద్ధం మరో పక్షం రోజులు కొనసాగితే, నవంబర్‌లో స్మార్ట్ టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరలు పెంపు తయారీదారులను రెండు రంగాల్లో ప్రభావితం చేస్తుంది. ఎలక్ట్రానిక్, గృహోపకరణాలలో కీలకమైన పదార్థం  ప్లాస్టిక్‌ ధరలు,  లాజిస్టిక్స్, సరఫరా ఖర్చులు పెరుగుతాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం  ఉత్పత్తి , డెలివరీ ఖర్చులో ఈ రెండింటి వాటా దాదాపు 33 శాతం.

ఇంకా, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వస్తువులు వంటివి ప్రభావితం కావచ్చు. దేశంలోని ఎఫ్‌ఎంసీజీ తయారీదారులు ఇప్పటికే పేలవమైన అమ్మకాలు, గ్రామీణ కుటుంబాల నుండి తగ్గిన డిమాండ్‌తో సతమత మవుతున్నారు. Nuvama ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకుల ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ వృద్ధి తక్కువగానే ఉంటుంది, ఆగస్టు నెలలో వర్షపాతం లోటు వందేళ్ల గరిష్టానికి చేరడంతో  ప్రముఖ FMCG కంపెనీల వృద్ది సింగిల్ డిజిట్‌కే  పరిమితం కానుంది.బీఎన్‌పీ పారిబాస్‌ డైరెక్టర్-హెడ్ ఆఫ్ ఇండియా ఈక్విటీ రీసెర్చ్, కునాల్ వోరా ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో  ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. అంతర్జాతీయ ఆదాయంలో మధ్య-ప్రాచ్య ప్రాంతం వాటా ఉన్న  డాబర్ , మారికో  లాంటి భారతీయ కంపెనీలకు నష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి  

అక్టోబర్ 6 నాటికి  ముడి చమురు ధర బ్యారెల్‌కు 84.58 డాలర్లు ఉండగా,  ఈరోజు (అక్టోబర్ 16) 90.98 డాలర్లకు పెరిగింది. ఈ యుద్ధం మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధరలు పైకి ఎగియ వచ్చు. దీంతో భారతదేశంతో సహా చమురు-దిగుమతి చేసుకునే దేశాలకు చమురు ధరలను పెంచడం తప్ప వేరే మార్గం ఉండదనే అంచనాలున్నాయి. 

అంతేకాదు ఈ యుద్ధంతో దేశీయ టీ ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంనుంచి తేయాకును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన ఇరాన్‌పై ప్రభావం చూపితే అది తమ పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన ఆందోళన. గాజాలో ఇజ్రాయెల్ తన చర్యలను ఆపకపోతే  తాము  చూస్తూ ఉరుకోబోమన్న ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వార్‌లో ఇరాన్- లెబనాన్ చేరిపోతే మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితి మరింత ముదురుతుందనే ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు