యాడ్వెంట్‌ చేతికి యురేకా ఫోర్బ్స్‌!

14 Sep, 2021 01:13 IST|Sakshi

రేసులో ముందంజపై అంచనాలు

ముంబై: కన్జూమర్‌ డ్యురబుల్స్‌ కంపెనీ యురేకా ఫోర్బ్స్‌ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజం యాడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ ముందు నిలవనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూరిఫయర్స్‌ దిగ్గజం యురేకా ఫోర్బ్స్‌ విక్రయానికి వీలుగా ప్రమోటర్‌ గ్రూప్‌ షాపూర్‌జీ పల్లోంజీ ఇప్పటిఏ బిడ్స్‌ను ఆహ్వానించిన విషయం విదితమే.

కంపెనీ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజాలు యాడ్వెంట్‌ ఇంటర్నేషనల్, వార్‌బర్గ్‌ పింకస్‌తోపాటు.. స్వీడిష్‌ హోమ్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ ఎలక్ట్రోలక్స్‌ బిడ్స్‌ పోటీపడుతున్నట్లు సంబంధిత వర్గాలు జూన్‌లో పేర్కొన్నాయి. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీకి అనుబంధ సంస్థే యురేకా ఫోర్బ్స్‌.

కోవిడ్‌–19 పరిస్థితుల తదుపరి ఆరోగ్యం, పరిశుభ్రత, గృహ సౌకర్యాలు(హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌) విభాగంపై అధిక దృష్టిపెట్టిన గ్రూప్‌ యురేకా ఫోర్బ్స్‌ను విక్రయించేందుకు నిర్ణయించింది. తద్వారా రుణ భారాన్ని సైతం తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.  

డీల్‌కు వీలుగా..: యురేకా ఫోర్బ్స్‌ విక్రయానికి అనువుగా డీల్‌ను కుదుర్చుకునేందుకు షాపూర్‌జీ గ్రూప్‌ అంతర్గత పునర్వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ నుంచి యురేకా ఫోర్బ్స్‌ను విడదీయనున్నట్లు తెలియజేశాయి. యురేకాను కొనుగోలు చేయడంలో యాడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు  అవకాశాలు అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ డీల్‌ ద్వారా లాభపడిన యాడ్వెంట్‌కు కన్జూమర్‌ విభాగంలో పట్టుండటం మద్దతుగా నిలవనున్నట్లు తెలియజేశాయి. రూ. 4,500–5,000 కోట్ల మధ్య విక్రయ ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు అంచనా వేశాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు