ఏజీఆర్‌ తీర్పు- ఎయిర్‌టెల్‌ జోరు

1 Sep, 2020 13:21 IST|Sakshi

6 శాతం జంప్‌చేసిన ఎయిర్‌టెల్‌ షేరు

11 శాతం పతనమైన వొడాఫోన్‌ ఐడియా 

10 ఏళ్లలోగా బకాయిలు చెల్లించాలన్న సుప్రీం కోర్టు

ఏజీఆర్‌ బకాయిలను పదేళ్లలోగా చెల్లించవలసిందిగా సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఇచ్చిన తాజా తీర్పులో భాగంగా బకాయిలలో 10 శాతాన్ని మార్చి 2021లోగా చెల్లించవలసి ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం 20 ఏళ్ల గడువును ప్రతిపాదించగా.. టెలికం కంపెనీలు 15ఏళ్ల గడువును అభ్యర్థించాయి. వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిలు రూ. 50,400 కోట్లుగా నమోదుకాగా.. భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 26,000 కోట్లవరకూ చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియా రూ. 7,854 కోట్లను చెల్లించగా, ఎయిర్‌టెల్‌ రూ. 18,000 కోట్లను చెల్లించినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ప్రతీ ఏడాది ఫిబ్రవరి 7కల్లా బకాయిల చెల్లింపులను చేపట్టవలసి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకోగా.. భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. 

ఇదీ తీరు
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 542 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 547 వద్ద గరిష్టాన్నీ, రూ. 514 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా 11 శాతం కుప్పకూలింది. రూ. 9.10 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో రూ. 10.80 వరకూ ఎగసిన ఈ షేరు రూ. 7.65 వరకూ పతనమైంది.

మరిన్ని వార్తలు