Amazon Work From Home Policy: ‘ఇంట్లోనే కూర్చోండి’.. ఉద్యోగులకు అమెజాన్‌ హెచ్చరిక!

21 Oct, 2023 11:50 IST|Sakshi

ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీని అతిక్రమించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సమస్య తీవ్రతను బట్టి లేఆఫ్స్‌ ప్రకటిస్తామని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులో​కి వచ్చాయి.  

అమెజాన్‌ ఇటీవల సంస్థలో రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగులు వారానికి మూడు సార్లు ఆఫీస్‌ రావాల్సిందేనని పట్టు బట్టింది. అయితే, సుదీర్ఘ కాలంలో ఇంటి వద్ద నుంచే పనిచేసిన సిబ్బంది ఆఫీస్‌కు వచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యాజమాన్యం, వారానికి 3 రోజులు కూడా ఆఫీస్‌కి రాకపోతే ఎలా? అని ప్రశ్నించింది. 

పైగా ఆఫీస్‌కి వచ్చేందుకు ఇష్టపడని ఉద్యోగుల్ని తొలగించే వెసులుబాటును మేనేజర్లకు కల్పించింది. తొలగింపులపై ఇంటర్నల్‌గా వర్క్‌ ఫోర్స్‌కి సమాచారం అందించే పోర్టల్‌ నోటీసుల్లో పేర్కొన్నట్లు పలు నివేదికలు హైలెట్‌ చేశాయి. ఆ నోటీసుల్లో రిటర్న్‌ టూ ఆఫీస్, ఆఫీస్‌ అవసరాలకు అనుగుణంగా లేని ఉద్యోగులతో మూడు దశల్లో వ్యవహరించాల్సిన తీరును పొందుపరిచింది. 

మొదటి దశలో, మేనేజర్లు వారానికి మూడు సార్లు ఆఫీస్‌కు వచ్చే అవసరాన్ని పాటించని ఉద్యోగులతో వ్యక్తిగతంగా మాట్లాడి భవిష్యత్‌ కార్యచరణను రూపొందించాలి. మొదటి దశలో సిబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని బట్టి 1 నుంచి 2 వారాల పాటు ఆఫీస్‌కి వచ్చేలా చూడాలి. అప్పటికి నిరాకరిస్తే, మేనేజర్ మరో సమావేశాన్ని నిర్వహించాలి.

ఆపై సదరు వాళ్లనే వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు తిరిగి ఆఫీస్‌కి వచ్చేలా ప్లాన్‌ చేయడం తప్పని సరి. రెండో దశలో సరైన కారణం లేకుండా వర్క్‌ ఫ్రం హోమ్‌ నుంచి విధులు నిర్వహిస్తూ వర్క్‌ కొనసాగడం క్రమశిక్షణా చర్యలకు దారి తీస్తుందని వార్నింగ్‌ ఇవ్వాలి. చివరిగా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగికి వ్రాతపూర్వక హెచ్చరిక లేదా ఫైర్‌ చేస్తూ హెచ్‌ఆర్‌ విభాగానికి తోడ్పాటు నందించేలా చూడాలని మేనేజర్లకు సూచించింది.

చదవండి👉‘ఇదే మా సంస్థ గొప్పతనం’.. ఒక్క ఫోటోతో అబాసుపాలైన దిగ్గజ కంపెనీ సీఈవో

మరిన్ని వార్తలు