అమెజాన్‌ ప్రత్యర్థి కంపెనీలో సంక్షోభం! భారీగా ఉ‍ద్యోగాల తొలగింపు..

10 Dec, 2023 17:22 IST|Sakshi

Zulily: ఒకప్పుడు 7 బిలియన్‌ డాలర్ల విలువతో అమెజాన్‌కు ప్రత్యర్థిగా ఉన్న ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ జులిలీ.. అమెరికాలో కార్యకలాపాలను మూసివేస్తూ వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది. 

సీటెల్‌తోపాటు వాషింగ్టన్‌లోని పలు ప్రాంతాలలో 292 మంది కార్మికులను జులిలీ తొలగించిందని, ఇది ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని అక్కడి రాష్ట్ర ఉపాధి భద్రతా విభాగం నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైనట్లు సీటెల్ టైమ్స్ వార్తా సంస్థ నివేదించింది.

గీక్‌వైర్‌ అనే న్యూస్‌ సైట్‌ ప్రకారం.. 13 ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తు​న్న జులిలీ తన పయనీర్ స్క్వేర్ ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని అనేక ఇతర కేంద్రాలను కూడా మూసివేస్తోంది. నెవాడా,  ఒహియోలోని గిడ్డంగులను మూసివేయడం వల్ల మరో 547 మంది కార్మికుల తొలగింపులు జరుగుతాయని రెండు రాష్ట్రాల నోటీసుల ప్రకారం తెలుస్తోంది. తాజా ఉద్యోగాల కోతలకు ముందు కూడా జులిలీలో పలు రౌండ్ల తొలగింపులు జరిగాయి. అక్టోబర్‌లో కంపెనీ సీఈవో టెర్రీ బాయిల్ రాజీనామా చేశారు. 

2010లో ప్రారంభం
ఆన్‌లైన్  జ్యువెలరీ రిటైలర్ బ్లూ నైల్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ వాడోన్, డారెల్ కావెన్స్ 2010లో జులీలీని ప్రారంభించారు. 2013 నాటికి జులీలీ 1.26 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్‌లను కలిగి ఉంది. 331 మిలియన్‌ డాలర్ల  ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2010 కంటే దాదాపు 700 శాతం అధికం. 2013లో ఐపీఓకి వచ్చినప్పుడు జులీలీ 2.6 బిలియన్‌ డాలర్ల విలువను కలిగి ఉండగా మొదటి రోజు ముగిసే సమయానికి ఆ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది.

2014 నాటికి జులీలీ 1 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 7 బిలియన్‌ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. అమెజాన్, ఓల్డ్ నేవీ కంపెనీలు మాత్రమే తక్కువ సమయంలో బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును చేరుకున్నాయి. 2015లో  జులిలీని లిబర్టీ ఇంటరాక్టివ్-క్యూవీసీ 2.4 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. తర్వాత దాన్ని క్యూరేట్‌గా పేరు మార్చింది. ఈ ఏడాది మేలో కంపెనీని లాస్ ఏంజిల్స్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రీజెంట్‌కు విక్రయించింది.

>
మరిన్ని వార్తలు