ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

10 Dec, 2023 17:11 IST|Sakshi

ఢిల్లీ: ఉచిత పథకాలపై ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పథకాలు వ్యయప్రాధాన్యతను వక్రీకరిస్తాయని చెప్పారు. ఉచిత పథకాల అంశంలో పోటాపోటీగా నడుస్తున్న రాజకీయాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ‘భారత మండపం’లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

ఉచిత పథకాలతో ప్రజల జేబులు నింపడం సరికాదని జగ్‌దీప్ ధన్‌ఖడ్ అన్నారు. ప్రజల జీవన శైలి, సమర్థత, నైపుణ్యాలను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. భారత్‌ మాదిరిగా ప్రపంచంలో ఏ ప్రదేశమూ మానవ హక్కులతో విరాజిల్లడం లేదని స్పష్టం చేశారు. ఉచితాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయని ఆయన చెప్పారు.

‘అమృత్‌ కాల్‌’ సమయంలోనే యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కూడా 75వ వార్షికోత్సవాన్ని చేసుకోవడం యాదృచ్ఛికమని జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని ఐరాస రెసిడెంట్‌ కోఆర్డినేటర్‌ శోంబి షార్ప్‌ పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ సెక్రటరీ పంపిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా తీవ్రవాదం, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులపై దాని ప్రభావం తీవ్రమైన సమస్యగా ప్రస్తావించారు.

ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి

>
మరిన్ని వార్తలు