Amazon Satcom: శాట్‌కామ్ సేవలకు ఇన్-స్పేస్ అనుమతి కోరిన అమెజాన్

10 Oct, 2023 13:57 IST|Sakshi

Amazon IN Space: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. స్పేస్‌ నుంచి  వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోని నోడల్ ఏజెన్సీ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్‌-స్పేస్‌) అనుమతి కోరింది. వన్‌వెబ్‌, జియో శాటిలైట్‌, ఎలాన్‌మస్క్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టార్‌లింక్‌ వంటి ప్రాజెక్ట్‌లకోవలోకి అమెజాన్‌ అడుగులేయనుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో భాగంగా ఉన్న గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్‌) కోసం కూడా దరఖాస్తు చేసుకోనుందని తెలుస్తుంది. అయితే స్టార్‌లింక్ జీఎంపీసీఎస్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంటర్ మినిస్టీరియల్ ప్యానెల్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే జియో శాటిలైట్, వన్‌వెబ్ ఈ జీఎంపీసీఎస్‌ లైసెన్స్‌ను పొందాయి.

భారతదేశ అంతరిక్ష విధానం 2023 ప్రకారం.. లోఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ ద్వారా శాటిలైట్ కాన్‌స్టెలేషన్ ఆపరేటర్‌లకు వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ అందించేలా నిబంధనలు ఉన్నాయి. దాంతో పాటు విదేశీ కంపెనీలు దేశంలో స్పేస్‌ నుంచి బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేలా వీలు కల్పిస్తున్నారు.  అయితే కంపెనీలు ఇన్‌స్పేస్‌ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. శాట్‌కామ్ స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం అమెజాన్‌ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్త సర్వీసును ప్రారంభించనున్నట్లు  కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 
 

మరిన్ని వార్తలు