ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చౌహాన్‌ బాధ్యతల స్వీకరణ

27 Jul, 2022 04:09 IST|Sakshi

ముగిసిన విక్రమ్‌ లిమాయే పదవీకాలం

కొత్త చీఫ్‌ కోసం బీఎస్‌ఈ అన్వేషణ

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈవోగా ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంత కాలం పాటు బీఎస్‌ఈ ఎండీ, సీఈవోగా వ్యవహరించగా, సోమవారంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్‌ఎస్‌ఈ సీఈవో, ఎండీగా విక్రమ్‌ లిమాయే పదవీ కాలం జూలై 15తో ముగిసిన నేపథ్యంలో, ఈ పదవికి చౌహాన్‌ ఎంపిక కావడం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్‌ కుమార్‌ కూడా ఒకరు.

2000 సంవత్సరంలో ఎన్‌ఎస్‌ఈని వీడారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూపు కంపెనీల్లో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు. తిరిగి 2009లో బీఎస్‌ఈ డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు చేపట్టి, 2012లో సీఈవో అయ్యారు. మరోవైపు బీఎస్‌ఈ కొత్త చీఫ్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అప్పటి వరకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ బీఎస్‌ఈ రోజువారీ వ్యవహారాలు చూస్తుందని పేర్కొంది.

కీలక బాధ్యతలు..  
ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా ఆశిష్‌కుమార్‌ ముందు పరిష్కరించాల్సిన పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో తరచూ సాంకేతిక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. టెక్నాలజీపై మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ దీనికి పరిష్కారం చూపిస్తారని భావిస్తున్నారు. అలాగే, కోలొకేషన్‌ స్కామ్‌లో ఎన్‌ఎస్‌ఈ తనపై పడ్డ మరకను కడిగేసుకోవాల్సి ఉంది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్‌ఎస్‌ఈని విజయవంతంగా ఐపీవోకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అలాగే, పాలనా లోపాలకు చెక్‌ పెట్టాల్సి ఉంది. బీఎస్‌ఈ బాస్‌గా ఆశిష్‌కుమార్‌ తనదైన ముద్ర వేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎక్సేంజ్‌గా తీర్చిదిద్దారు. అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్లాట్‌ఫామ్‌ బీఎస్‌ఈ స్టార్‌ ఎంఎఫ్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు