Azim Premji Life Facts: ఒకపుడు కాలేజీ డ్రాపవుట్‌, మరిపుడు రోజుకు రూ. 27 కోట్లు దానం

25 Jul, 2022 15:34 IST|Sakshi

ఆసియా కుబేరుడు  అజీమ్‌ ప్రేమ్‌జీ 

సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు, అజీమ్ ప్రేమ్‌జీ జూలై 24న తన 77వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు, ఆసియాలోని అగ్రశ్రేణి దాతృత్వవేత్తలలో ఒకరుగా పేరుగాంచిన అజీం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కూరగాయల ఉత్పత్తులు, ప్రధానంగా కూరగాయల నూనె కంపెనీగా ప్రారంభమైంది విప్రో ప్రస్థానం. 1966లో తన తండ్రి మరణించిన తర్వాత ప్రేమ్‌జీ  కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టారు.

కాలేజీ డ్రాపౌట్ నుంచి  ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలలో విప్రో లిమిటెడ్‌ను చైర్మన్‌గా మారడం  దాకా, అజీమ్ ప్రేమ్‌జీ వ్యవస్థాపక ప్రయాణం స్ఫూర్తిదాయకం. జూలై 24, 1945న ముంబైలో పుట్టిన అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ తన కుటుంబ వ్యాపారాన్ని (వనస్పతి నూనెను ఉత్పత్తి చేసే కంపెనీ)  ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ పరిశ్రమలలో ఒకటిగా మార్చిన ఘనత సొంతం చేసుకున్నారు. 

కాలేజీ డ్రాపవుట్‌: స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదువుతుండగా, తండ్రి మహమ్మద్ హషీమ్ ప్రేమ్‌జీ మరణించడంతో చదువుకు స్వస్తి  చెప్పి 1966లో  వ్యాపార బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ప్రేమ్‌జీ వయసు కేవలం 21 ఏళ్లే

పాకిస్థాన్ ఆహ్వానం తిరస్కరణ: 1947లో ఇండియా-పాకిస్థాన్‌ విడిపోయినప్పుడు, పాకిస్తాన్‌ నేత మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్‌కు  మారమని ప్రేమ్‌జీ తండ్రికి ఆహ్వానం పంపారట. అయితే అందుకు నిరాకరించిన ముహమ్మద్ ప్రేమ్‌జీ దేశంలోనే ఉండాలని  నిర్ణయించు కున్నారు.

ప్రేమ్‌జీకి ఎప్పుడూ విలాసాల పట్ల మోజు లేదు. ఖరీదైన కార్లు అంతకన్నా లేవు. ఇప్పటికీ ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణాన్ని ఇష్ట పడతారట. వ్యాపార పర్యటనల సమయంలో కంపెనీ గెస్ట్ హౌస్‌లకే ప్రాధాన్యం. అంతేకాదు కంపెనీ క్యాంటీన్ ఆహారాన్నే ప్రిఫర్‌ చేసేవారు.

విప్రో ఆవిర్బావం
1979లో ఐబీఎం ఇండియానుంచి నిష్క్రమించిన తర్వాత ఐటీ రంగంలోకి ప్రవేశించింది విప్రో. అనంతరం బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాలతో టాప్‌ కంపెనీగా ఎదిగింది. తన తాత 'నిజాయితీ' సూత్రమే తన విజయానికి కారణమని అజీమ్ ఎపుడూ చెబుతూ ఉంటారు.

30 ఏళ్ల తరువాత డిగ్రీ పూర్తి చేసిన అజీంజీ
స్టాన్‌ఫోర్డ్‌లో గ్రాడ్యుయేషన్ వదిలిపెట్టిన ఆయన డిస్టెంట్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేయడం విశేషం. కాగా 2021నాటి లెక్కల ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా సామాజిక ప్రయోజనాల కోసం 1.3 బిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చారు. జీవితంలో మొత్తం దాదాపు 10వేల కోట్లను దానం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2021లో కూడా ప్రేమ్‌జీ రూ.9,713 కోట్ల విలువైన విరాళాలతో అగ్రస్థానాన్ని నిలిచారు.  అంటే  రోజుకు 27 కోట్ల మేర దానం చేశారు.

పద్మ పురస్కారాలు
విప్రో 75 ఏళ్ల వ్యాపార ప్రయాణం గురించి రాసిన ‘ద స్టోరీ ఆఫ్‌ విప్రో’ (The Story of Wipro)’పుస్తకాన్ని అజీమ్‌ ప్రేమ్‌జీ గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. అజీమ్ ప్రేమ్‌జీ యాస్మీన్ ప్రేమ్‌జీని వివాహం చేసుకోగా, ఇద్దరుపిల్లు రిషద్ ప్రేమ్‌జీ , తారిఖ్ ప్రేమ్‌జీ ఉన్నారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషికిగాను అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. 2005లో "పద్మ భూషణ్ అవార్డు", 2011లో, "పద్మ విభూషణ్" లభించింది.

ఇది కూడా చదవండి: ITR Filling Benefits: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్‌ ఫైలింగ్‌ లాభాలు తెలుసా?

మరిన్ని వార్తలు