కుటుంబం మద్దతుతోనే ఉద్యోగంలో రాణింపు

21 Nov, 2023 06:30 IST|Sakshi

ఇంటివద్ద ప్రశాంతత లోపిస్తే ఉద్యోగంపై ప్రభావం

మూడింట రెండొంతుల మంది అభిప్రాయం

జీనియస్‌ కన్సల్టెంట్స్‌ సర్వేలో వెల్లడి

ముంబై: ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఉద్యోగంపైనా పడుతుందని మెజారిటీ ఉద్యోగులు అంటున్నారు. ఇంట్లో సరిగ్గా లేని రోజు ఉద్యోగంలోనూ అదే మాదిరిగా ఉంటుందని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అనే మానవ వనరుల సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో మూడింట రెండొంతుల మంది చెప్పారు. చక్కని ఉద్యోగ/వృత్తి జీవితానికి, పనిలో ఉత్పాదకతకు కుటుంబం మద్దతు ఎంత ముఖ్యమో ఈ సర్వే గుర్తు చేసింది.

వ్యక్తిగత జీవితంలో కష్టాలు/అశాంతి అనేవి కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారితీస్తాయని, ఫలితంగా సామర్థ్యం తగ్గిపోతుందని సర్వేలో 69 శాతం మంది చెప్పారు. ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య అంతర్గత అనుసంధానత ఉంటుందని, ఒక దాని ప్రభావం మరోదానిపై పడుతుందన్న అభిప్రాయం వినిపించింది. ఆగస్ట్‌ 20 నుంచి సెపె్టంబర్‌ 26 మధ్య 1,088 మంది వృత్తి నిపుణులను ప్రశ్నించి, జీనియస్‌ కన్సల్టెంట్స్‌ ఈ వివరాలు విడుదల చేసింది.

బీఎఫ్‌ఎస్‌ఐ, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, ఎఫ్‌ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్‌ఆర్‌ సేవలు, ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఫార్మా తదితర రంగాల్లో పనిచేసే వారు ఇందులో ఉన్నారు. నియమ రహితంగా, అస్తవ్యస్థంగా ఉండే వ్యక్తిగత జీవితం, పనిలోనూ అదే ధోరణికి దారితీస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. పనిలో వృత్తి నైపుణ్యాలు చూపించి, రాణించాలంటే.. వ్యక్తిగత జీవితం క్రమశిక్షణగా, నియమబద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.

► కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుందని 70 శాతం మంది చెప్పారు.  
► కుటుంబం మద్దతు ఉంటే పనిలో సామర్థ్యాల పెరుగుదలకు సాయపడుతుందని 15 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదలకు అనుకూలిస్తుందని 6 శాతం మంది తెలిపారు.  
► పని ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలని 15 శాతం మంది చెప్పగా, పని ప్రాంతంలో గోప్యత అవసరమని 2 శాతం మంది పేర్కొన్నారు.  
► మొత్తం మీద కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగంలో మెరుగ్గా రాణిస్తామని 71 శాతం మంది చెప్పారు.

మరిన్ని వార్తలు