వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..

14 Sep, 2023 17:30 IST|Sakshi

దేశంలోని వాహన డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆటోమొబైల్స్ డీలర్లు కూడా వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను తెరవాలని కోరారు.

ఐదో ఆటో రిటైల్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తోందని, తదనుగుణంగా వాహన స్క్రాపింగ్ సౌకర్యాలను ప్రారంభించడానికి ప్రభుత్వం డీలర్లకు అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. భారత్‌ ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌లో అతిపెద్ద తయారీదారుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. 

భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆటో డీలర్లు ముఖ్యమైన పాత్ర పోషించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో నాలుగో స్థానంలో, వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా మార్చడమే తన కల అని గడ్కరీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు