మధ్య కాలానికి డెట్‌లో పెట్టుబడులు: ఫండ్‌ రివ్యూ

14 Nov, 2022 14:50 IST|Sakshi

యాక్సిస్‌ స్ట్రాటజిక్‌ బాండ్‌ ఫండ్‌  

ఆర్‌బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా అన్ని ప్రముఖ సెంట్రల్‌ బ్యాంకుల వైఖరి ప్రస్తుతం రేట్ల పెంపు దిశగానే ఉంది. తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ భేటీల్లో మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాల వ్యవధితో కూడిన బాండ్లను ఎంచుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఈ తరుణంలో మీడియం డ్యురేషన్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాల బాండ్లతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో వీటిపై పడే ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కనుక మధ్య కాలానికి ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో యాక్సిస్‌ స్ట్రాటజిక్‌ బాండ్‌ ఫండ్‌ కూడా ఒకటి. పెట్టుబడుల పరంగా పెద్దగా రిస్క్‌ తీసుకోకుండా మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. 


పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో 
పెట్టుబడుల విషయంలో ఈ పథకం ఎక్కువ రిస్క్‌ తీసుకోదు. ఇందుకు నిదర్శనం పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం అధిక భద్రతను సూచించే ఏఏఏ, ఏఏ రేటింగ్‌ సాధనాలు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని రూ.1,570 కోట్ల పెట్టుబడుల్లో 20 శాతం నగదు రూపంలోనే ఉంది. వడ్డీ రేట్ల పరంగా స్థిరత్వం లేనందున నగదు నిల్వలు ఎక్కువగా కలిగి ఉందని తెలుస్తోంది. ఇక మిగిలిన 80 శాతం పెట్టుబడుల్లో 94 శాతం అధిక భద్రత సాధనాల్లోనే ఉన్నాయి. రిస్క్‌ ఉండే ఏ, అంతకంటే దిగువ రేటింగ్‌ సాధనాల్లో కేవలం 5 శాతం పెట్టుబడులనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడుల కాల వ్యవధి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. 33 శాతం పెట్టుబడులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉండడాన్ని గమనించాలి.  
రాబడులు 
గడిచిన ఏడాది కాలంలో యాక్సిస్‌ స్ట్రాటజిక్‌ బాండ్‌ ఫండ్‌ 3.5 శాతం రాబడినిచ్చింది. ఇక గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 6.5 శాతం చొప్పున రాబడులను తెచ్చి పెట్టింది. ఏడేళ్లలో 7.34 శాతం, పదేళ్లలో 7.89 శాతం చొప్పున ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రతిఫలాన్నిచ్చింది. ఈ విభాగం సగటు రాబడుల కంటే ఈ పథకంలోనే ఎక్కువ ఉన్నాయి. మీడియం డ్యురేషన్‌ విభాగం సగటు రాబడులు గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 5.5 శాతంగా ఉన్నాయి. ఏడేళ్లలో 6.32 శాతం, పదేళ్లలో 7.37 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. బాండ్‌ ఫండఖ కావడంతో ఈ పథకంలో సిప్‌ వల్ల ఉపయోగం ఉండదు. దీనికి బదులు ఏకమొత్తంలో నిర్ణీత కాలానికోసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది

మరిన్ని వార్తలు