ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. 62 బిర్యానీలు ఆర్డర్‌ చేసిన మహిళ

3 Sep, 2023 18:16 IST|Sakshi

వీకెండ్‌లు, పండగలు.. ఇలా సందర్భం ఏదైనా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం సాధారణంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులతో కలసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు కాస్త ఎక్కువగానే ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 62 బిర్యానీలు ఆర్డర్‌ చేసింది.

శనివారం(సెప్టెంబర్‌ 2) భారత్-పాకిస్తాన్ (India-Pakistan match) ఆసియా కప్ (Asia Cup 2023) మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెంగళూరు వాసి ఒకరు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో 62 బిర్యానీలను ఆర్డర్ చేశారు.

దీని గురించి స్విగ్గీ సంస్థ ‘ఎక్స్‌’(ట్విటర్‌) (Twitter)లో షేర్‌ చేసింది. "బెంగళూరు నుంచి ఎవరో ఇప్పుడే 62 యూనిట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు? ఎవరు మీరు? ఎక్కడ ఉన్నారు? భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కి వాచ్ పార్టీని నిర్వహిస్తున్నారా? మేమూ రావచ్చా?" అంటూ రాసుకొచ్చింది.

స్విగ్గీ పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు పోస్ట్‌పై కామెంట్‌ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి ఎవరా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫుడ్‌ ఫ్రీ పంపిస్తారా? అంటూ ఓ యూజర్‌ చమత్కరించారు. కానీ వర్షం కారణంగా పార్టీ అకస్మాత్తుగా ముగిసింది అంటూ మరొకరు నిట్టూర్చారు.

కాగా శ్రీలంకలోని క్యాండీలో పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 266 పరుగులు చేయగా వర్షం కురవడంతో పాకిస్తాన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ఆడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. సోమవారం ఇదే వేదికపై భారత్‌ నేపాల్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు