రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్‌ మూవీలు ఏవో తెలుసా?

14 Aug, 2022 12:17 IST|Sakshi

బాలీవుడ్‌పై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆసక్తి

ఇంగ్లీష్ వింగ్లీష్, షమితాబ్, కి అండ్‌ కా అనే మూడు మూవీలను నిర్మించారు  

సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇక లేరన్న వార్త  అటు స్టాక్‌మార్కెట్‌​ నిపుణుల్ని, ఇటు ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కేవలం 5 వేల రూపాయలతో  స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడిదారుడిగా తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఝున్‌ఝున్‌వాలా ప్రస్తుత నికర విలువ 5 బిలియన్ల డాలర్లకుపై మాటే అంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. 

మధ్యతరగతి కుటుంబంలో జన్మించిమార్కెట్ నిపుణిగా రాకేష్ సక్సెస్‌ఫుల్‌ జర్నీ చాలామందికి స్ఫూర్తిదాయకం. ఏ స్టాక్‌పై ఇన్వెస్ట్‌ చేయాలో, దాని ఫండమెండల్స్‌ ఏంటో అలవోకగా చెప్పగల సామర్థ్యం అతని సొంతం. స్నేహితుల ద్వారా స్టాక్ మార్కెట్‌పై పెంచుకోవడమే కాదు, లాభాలను అంచనా వేయడంలో పెట్టుబడిలో, రిస్క్‌ తీసుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. కేవలం సంపదను ఆర్జించడమే కాదు, సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వానికి వినియోగించిన  గొప్ప వ్యక్తిత్వం ఆయనది.  

ఇంగ్లీష్‌ వింగ్లీష్‌
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా బాలీవుడ్ సినిమాల పట్ల  చాలా అభిమానం. ఈ నేపథ్యంలో మూడు బాలీవుడ్ సినిమాలను నిర్మించారు. ఇంగ్లీష్ వింగ్లీష్, షమితాబ్,కి అండ్‌ కా అలాగే 1999లో మరో నలుగురు భాగస్వాములతో కలిసి హంగామా డిజిటల్ మీడియాను కూడా ప్రారంభించారు. ఇదే తరువాత హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.గా మారింది. ప్రస్తుతం దీనికి ఆయన కంపెనీ ఛైర్మన్‌గా ఉన్నారు.

ముఖ్యంగా 'ఇంగ్లీష్ వింగ్లీష్' తో భారీ విజయం సాధించారు. గౌరీ షిండే దర్శకత్వంలో 2012లో దివంగత అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రగా ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీని నిర్మించారు.10 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ 102 కోట్లను వసూళ్లతో భారీ ఆర్థిక విజయాన్ని సాధించింది. అంతేకాదు 2012 గౌరీ షిండే  ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును గెలుచు కున్నారు. అంతేనా ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు కోసం ఇండియానుంచి అధికారిక ఎంట్రీగా షార్ట్‌లిస్ట్ అయింది. అనేక అంతర్జాతీయ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. శ్రీదేవి "మెరిల్ స్ట్రీప్ ఆఫ్ ఇండియా",  "భారత మహిళా రజనీకాంత్"గా ప్రశంసలు దక్కించుకోవడం మరో విశేషం.

అతను చైనీస్ వంటకాలను ఎక్కువగా ఆస్వాదించే పెద్ద ఆహారప్రియుడు కూడా. కుకింగ్‌ షోలను చూసి ఎక్కువ ఆనందించే వారట. సామాన్యుడికి విమాన సేవల్ని అందించాలన్న లక్క్ష్యంతో  ఆకాశ విమానయాన సంస్థను స్థాపించారు. ఆగస్ట్ 7న తన సేవలను కూడా ప్రారంభించింది.

సీఎన్‌బీసీ టీవీతో చివరిగా మాట్లాడిన ఆయన "భారతదేశం ఒక స్వర్ణకాలంలోకి అడుగుపెట్టబోతోంది,10 శాతం వృద్ధిని సాధిస్తుంది’’ అని రాకేష్‌ అంచనా వేశారు. కానీ ఇంతలోనే కిడ్నీ వ్యాధి, ఇస్కీమిక్ గుండె జబ్బుతో అనారోగ్యానికి గురైన ఆయన  62 ఏళ్ల వయసులో  ముంబైలోని  బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గుండెపోటుతో  ఆదివారం ఉదయం కన్నుమూశారు.

మరిన్ని వార్తలు